పాత కథలు చెప్పొద్దు
పాత కథలు చెప్పొద్దు అంటోంది యువ నటి శ్రీ దివ్య. ఫర్వాలేదే ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా కథలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందే అని అనుకుంటున్నారా? మొదట్లో ఒక్క అవకాశం ప్లీజ్ అనే తారలు ఆ తరువాత ఒక్క విజయం వరిస్తే చాలు. అది వారి ప్రతిభ కాపోయినా సరే తదుపరి చిత్రానికి అంత పారితోషికం కావాలి లాంటి డిమాండ్లతో దర్శక, నిర్మాతలను కలతకు గురిచేస్తుండడం ఇక్కడ షరా మామూలే. ఇక నటి శ్రీదివ్య విషయానికొస్తే ఈ అమ్మడు ఇక్కడ తొలి చిత్రంగా చెప్పుకుంటున్న వరుత్త పడాద వాలిబర్ సంఘం నిజానికి మలి చిత్రం.
శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి అయితే ఈ చిత్రం ఆమెకి ఆరో చిత్రం ఏడో చిత్రంగా కూడా విడుదలయ్యే చాన్స్ కనిపించడం లేదు. వరుత్త పడాద వాలిబర్ సంఘం జీవా, వెల్లక్కార దురై వంటి వరుస విజ యాలతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య నటించిన తాజా చిత్రం కాక్కిసట్టై కూడా హిట్ అనిపించుకోవడంతో మంచి జోష్ మీదుంది. తదుపరి పెన్సిల్, ఈట్టి చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శ్రీ దివ్య తొలి చిత్రం కాట్టుమల్లి ఆర్థికపరమైన కారణాల వలన షూటింగ్‌ను పూర్తి చేసుకోలేకపోయింది.
అలాంటి చిత్రాన్ని దర్శక నిర్మాతలు అష్టకష్టాలు పడి పూర్తి చేయాలని భావించి శ్రీదివ్య కాల్‌షీట్స్ అడిగితే నటిస్తాను కానీ అప్పటి పారితోషికానికే చేయమనే పాత కథలు చెప్పొద్దు. ప్రస్తుత స్థాయికి తగ్గట్టుగా పారితోషికం చెల్లించాలి అనడంతో కాట్టుమల్లి కథ మళ్లీ కంచికి చేరే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శ్రీదివ్య రూ.50 లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో! ఇది శ్రీదివ్య, కాట్టుమల్లి వృత్తాంతం అన్నట్టు ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో వారధి అనే చిత్రంలో నటిస్తోంది.