
అలక వీడిన అళగిరి
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి హెచ్చరిక స్వరంతో ఆయన పెద్దకుమారుడు అళగిరి అలక వీడారు. బుధవారం గోపాలపురంలో అధినేతను కలుసుకున్నారు. తన ఆవేదనను ఏకరువు పెట్టారు. అయితే, కరుణ ఇచ్చిన వార్నింగ్ ప్రత్యేకంగా తనకు కాదంటూ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. టీవీ ఛానల్‌కు అళగిరి ఇచ్చిన ఇంటర్వ్యూ డీఎంకేలో ప్రకంపన సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన అధినేత ఎం కరుణానిధి మంగళవారం ప్రత్యేక ప్రకటన చేశారు. అళగిరికి, ఆయన మద్దతుదారులకు షాక్ ఇచ్చే విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీసింది. అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అళగిరి వెనక్కు తగ్గారు. ఉదయాన్నే కరుణానిధిని కలుసుకుని ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం.
భేటీ: కరుణానిధి అపాయింట్‌మెంట్ కోసం కొంత కాలంగా అళగిరి ప్రయత్నిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అనుమతి లభించక పోవడం, పార్టీలో తనను పక్కన పెడుతుండడంతో ఇంటర్వ్యూ ద్వారా చర్చల్లోకి ఎక్కారు. చివరకు అళగిరికి కరుణానిధి నుంచి ఆహ్వానం వచ్చింది. చెన్నైలో ఉన్న అళగిరి ఉదయం 9 గంటలకు గోపాలపురం చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన ఆయన తల్లి దయాళు అమ్మాళ్‌ను పరామర్శించినానంతరం పార్టీ అధినేత, తండ్రి కరుణానిధితో అరగంట పాటుగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎవరు ఎవరిని బుజ్జగించారో బయటకు రాకున్నా, ఆ వ్యాఖ్యలపై మాత్రం కరుణానిధి తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, తనకు జరుగుతున్న అవమానం, పార్టీలో తన స్థానం, దక్షిణాదిలో తన బలం తగ్గేలా కుట్రలు జరుగుతుండటం వంటి అంశాలను కరుణానిధి వద్ద అళగిరి ఏ కరువు పెట్టినట్లు సమాచారం. తీవ్ర ఆవేదనతో ఇంట్లోకి వెళ్లిన అళగిరి, తిరిగి వచ్చే క్రమంలో ఉల్లాసంగా ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొనడం గమనార్హం. అళగిరి బయటకు వచ్చారో లేదో ఇటీవల మదురైకు కొత్తగా ప్రకటించిన డీఎంకే కమిటీ గోపాల పురం ఇంట్లోకి ప్రవేశించింది.
ఆ వార్నింగ్ నాకు కాదు: కరుణానిధి చేసిన హెచ్చరికల స్వరాన్ని గుర్తు చేస్తూ మీడియా ప్రతినిధి అళగిరిని ప్రశ్నించగా, అది నాకు కాదు అని సమాధానం ఇచ్చారు. పార్టీ పరంగా అందర్నీ ఉద్దేశించి అధినేత ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఎవరు బడితే వాళ్లు ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఆ ప్రకటన చేశారని చెప్పారు. ప్రత్యేకంగా తనను ఉద్దేశించి మాత్రం కాదన్న విషయాన్ని మీడియా గుర్తించాలని హితవు పలికారు. పార్టీలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, సమస్యలెదురైనా అళగిరి వెంటే తాముంటామంటూ మదురై లోని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. అళగిరి కాకుండా మరొకరు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే పార్టీ నుంచి ఇప్పటికే వేటు పడేదని డీఎండీకే నుంచి ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నాయకుడు బన్రూటి రామచంద్రన్ వ్యాఖ్యానించడం గమనించాల్సిందే.