ఆపండి! | Alagiri said Stalin would die in a few months: M Karunanidhi | Sakshi
Sakshi News home page

ఆపండి!

Published Thu, Jan 30 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

Alagiri said Stalin would die in a few months: M Karunanidhi

‘అళగిరి నా అన్నయ్య.. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దు... రాద్ధాంతం వద్దు... రచ్చ చేయొద్దు...  అన్నీ ఆపండి’ అని మద్దతుదారులకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ విన్నవించారు. అదే సమయంలో తనయుడికి ముప్పు ఉందని, భద్రత పెంచాలని కేంద్రానికి కరుణానిధి లేఖాస్త్రం సంధించారు. కరుణ మనవడు దురై దయానిధి స్పందిస్తూ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయని చెప్పడం గమనార్హం. 
 
 సాక్షి, చెన్నై: డీఎంకేలో బయలుదేరిన ముసలం గాలివానగా మారుతోంది. అళగిరి సస్పెన్షన్‌తో ఆయన మద్దతుదారులు అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డీఎంకేతో తాడో పేడో తేల్చుకునే విధంగా విమర్శలు సంధిస్తున్నారు. వీరి చర్యలపై మంగళవారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. అళగిరి తీరును దుయ్యబట్టారు. స్టాలిన్ మరో రెండు నెలల్లో చచ్చిపోతాడంటూ అళగిరి హెచ్చరించినట్టు కరుణానిధి చేసిన వ్యాఖ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. దీనిపై అళగిరి స్పందించినా, స్టాలిన్ మద్దతుదారులు మాత్రం తగ్గలేదు. అళగిరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆయన్ను హేళన చేస్తూ పోస్టర్లు వెలిశాయి. 
 
 స్టాలిన్ మద్దతుదారులు చెన్నైలో 20 చోట్ల అళగిరి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతుండడంతో స్టాలిన్ స్పందించారు. తన మద్దతుదారులను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. పట్టించుకోవద్దు: దివంగత నేత అన్నా ఆశయ సాధన, అధినేత కరుణానిధి అడుగు జాడల్లో డీఎంకే పయనం సాగుతోందని గుర్తు చేశారు. పార్టీలో సమస్యలు, ఆరోపణలు సహజం అని వివరించారు. తనకు ఏదో ముప్పున్నట్టుగా వ్యాఖ్య చేసింది.. నా సోదరుడే...దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు...పెద్దది చేయొద్దు అని తన మద్దతుదారులకు హితవు పలికారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనం, పోస్టర్ల ఏర్పాటును మానుకోవాలని సూచించారు. అందరూ సంయమనంతో ముందుకెళ్లాలని విన్నవించారు. 
 
 భద్రత పెంచండి: అళగిరి వ్యాఖ్యల నేపథ్యంలో స్టాలిన్‌కు ముప్పు ఉందన్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. డెప్యూటీ సీఎంగా స్టాలిన్ పనిచేశారని, ఒక పార్టీకి కోశాధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా, ఆయనకు భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు ద్వారా ఆర్థిక మంత్రి చిదంబరం సహకారంతో  కేంద్ర హోం శాఖపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. 
 శాశ్వతంగా బయటకు: అళగిరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఆయన్ను శాశ్వతంగా బయటకు పంపించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
 
 ఆ దిశగా రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయం వర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యలను ధిక్కరిస్తూ ఎదురు దాడికి దిగడం, పార్టీ వర్గాల్ని ఓ చోట చేర్చి మంతనాలు జరుపుతుండటం, తానేమిటో 31న ప్రకటిస్తానంటూ జబ్బలు చరచడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. నోటీసులిచ్చి వారంలోపు అళగిరి ఇచ్చే వివరణ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోన్నారు. అళగిరి కుమారుడు, కరుణానిధి మనవడు దురై దయానిధి మీడియాతో మాట్లాడుతూ, నిజాలు అంత సులభంగా దాగవని, అవి ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతాయని పేర్కొనడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement