అనుభవించు రాజా.. | Again, maybe two weeks of the election campaign | Sakshi
Sakshi News home page

అనుభవించు రాజా..

Published Sat, Apr 19 2014 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Again, maybe two weeks of the election campaign

  • విశ్రాంతిలో నేతలు ..
  •  ఎన్నికల వేళ మండుటెండల్లో రెండు వారాల పాటు ప్రచారం
  •  అనంతరం రిసార్టులు, మసాజ్ పార్లర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో రెస్ట్
  •  మే16న కౌంటింగ్.. అంతవరకూ కోడ్ అమలు
  •  అధిష్టానం ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం
  •  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్న సిద్ధు, పరమేశ్వర
  •  మధ్యప్రదేశ్, బీహార్‌కు బీజేపీ జాతీయ నేత అనంత కుమార్
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో అలసిపోయిన ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. మరో ఒకటి, రెండు రోజుల అనంతరం అధిష్టానం ఆదేశాల మేరకు తమకు నిర్ణయించిన ప్రాంతాల్లో ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. మండుటెండల్లో రెండు వారాల పాటు ప్రచారంలో పాల్గొన్న నాయకులందరూ పూర్తిగా అలసిపోయారు.

    గురువారం ఒకే దశలో మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ పూర్తి కావడం, రీపోలింగ్ కేంద్రాల సంఖ్య పెద్దగా లేకపోవడంతో నాయకులందరూ బతుకు జీవుడా అని వివిధ చోట్ల విశ్రాంతికి ఉపక్రమించారు. కొందరు రిసార్టులకు వెళితే, మరి కొందరు మసాజ్ పార్లర్లు, బంధువుల వ్యవసాయ క్షేత్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత మంది ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపు మే 16న జరగనుండడంతో అంతవరకు నాయకులు చేయగలిగిందేమీ లేదు.

    అప్పటి వరకు ఎన్నికల నియమావళి కూడా అమలులో ఉంటుంది కనుక ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలు కూడా పెద్దగా ఉండబోవు. దేశ వ్యాప్తంగా ఇంకా నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పార్టీల అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కావడంతో, గెలుపోటముల గురించి పెద్దగా ఆలోచించకుండా ప్రస్తుతం అందరూ బడలిక తీర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎండలు మండిపోతున్నా ఇన్నాళ్లూ విధి లేక ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇప్పుడు కాస్త విశ్రాంతి అనంతరం మరో ప్రస్థానం వైపు మళ్లాల్సి ఉంది.

    మే 12న తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు తొలుత తమిళనాడులో ప్రచారాని వెళ్లనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేపడతారు. పరమేశ్వర బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న గుజరాత్‌లోని వడోదరలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

    విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ పార్టీ తమిళనాడు పరిశీలకుడిగా నియమితులయ్యారు. మహారాష్ర్ట సహా ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం, పరమేశ్వరలు ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ పార్టీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ర్టంలో రెండు దశల ఎన్నికల పూర్తయ్యాయి.

    ఈ నెల 24న ఆఖరి విడత ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ప్రచారం, సమన్వయ బాధ్యతలను పూర్తి చేసిన అనంతరం ఆయన బీహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్‌లతో పాటు మాజీ మంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, శోభా కరంద్లాజె, ఆర్. అశోక్‌లు వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లే అవకాశాలున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement