జోష్ | AIADMK leaders full josh in Tamil nadu election | Sakshi
Sakshi News home page

జోష్

Published Thu, Mar 24 2016 8:25 AM | Last Updated on Thu, May 24 2018 12:08 PM

జోష్ - Sakshi

జోష్

మనసు మార్చుకున్న శరత్‌కుమార్
ఎదురు చూపుల్లో వాసన్
ఫిర్యాదులతో సతమతం
రెబల్స్‌కు గ్యారంటీ
20 మందికి ఒక ఇన్‌చార్జ్
అన్నాడీఎంకే కొత్త వ్యూహం

 
ఇంటర్వ్యూల రూపంలో తమకు అమ్మ దర్శనం లభిస్తుండడంతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు. ఓ వైపు ఆశావహుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ, మరో వైపు వివిధ పార్టీల సంఘాల నాయకులతో మంతనాల్లో సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బిజీబిజీగా ఉన్నారు. ఇక, అటూ...ఇటూ అని చివరకు అమ్మ చెంతకే చేరాల్సిన పరిస్థితి
 శరత్‌కుమార్‌కు ఏర్పడింది. అమ్మ కరుణతో ఆయన ముఖంలో ఆనందం వెల్లి విరిసింది.  
 
చెన్నై: మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచనల్లో మునిగి ఉన్నారు. చిన్న పార్టీల్ని తప్పా, పెద్ద పార్టీల్ని దగ్గరకు రానివ్వకుండా నాలుగైదు రోజులుగా  రోజూ వారి బిజీ షెడ్యూల్‌తో ఆమె ముందుకు సాగుతున్నారు.అభ్యర్థుల ఎంపిక  భారాన్ని తన భుజాన వేసుకుని ఇంటర్వ్యూల్ని సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా తమకు ఇంటర్వ్యూల రూపంలో అమ్మ దర్శనం అవుతుండడంతో పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నారు.

తమకు సీటు రాకున్నా పర్వాలేదని, అమ్మను నేరుగా కలుసుకునే అవకాశం దక్కడం ఆనందంగా ఉందంటూ పలువురు కొత్త ముఖాలతో కూడిన ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశావహులు, వారి మద్దతు దారులు తరలి వస్తుండటంతోపాటు, పలు రాజకీయ పక్షాల నాయకులు మద్దతు నిమిత్తం పడగలెత్తుతుండడంతో పోయెస్‌గార్డెన్ పరిసరాలు ఎన్నికల వాతావరణంలో మునిగి ఉన్నాయి.  అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్న ఆశావహుల మీద ఫిర్యాదులు సైతం బయలు దేరడం గమనార్హం.

కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురంల నుంచి ఇంటర్వ్యూకు వచ్చి వెళ్లిన వాళ్లలో పలాన వ్యక్తికి అంటే, పలాన వ్యక్తికి సీటు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి చేరుతున్నాయి. ఇది కాస్త కొత్త భారాన్ని , సమస్యను సృష్టిస్తున్నదంటూ అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, డీఎండీకేలో ఉంటూ రెబల్స్ అవతారం ఎత్తి చివరకు పదవుల్ని వదులుకున్న మాజీ ఎమ్మెల్యేకు అమ్మ సీట్లు ఖరారు చేసినట్టుగా సంకేతాలు రావడం విశేషం. అదే సమయంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మందిపై అమ్మ కన్నెర్ర చేసినట్టు సమాచారం.


మనసు మార్చుకున్న శరత్:  గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్ పయనం సాగించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే, సినీ నటుల సంఘం ఎన్నికల తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఆయన వ్యవహరించిన విషయం విధితమే. అన్నాడీఎంకే నుంచి బయటకు వస్తున్నామని ప్రకటించి, చివరకు పార్టీని రెండుగా చీల్చుకోవాల్సిన పరిస్థితుల్ని శరత్‌కుమార్ చవి చూశారు.

బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నించి, చివరకు మనస్సు మార్చుకున్న శరత్‌కుమార్‌కు అమ్మే దిక్కు అయ్యారు. అన్నాడీఎంకే నుంచి పిలుపు వచ్చిందో, లేదా, అమ్మకు వేడుకోలు పంపించారో ఏమోగానీ, పోయెస్ గార్డెన్‌లో బుధవారం ప్రత్యక్షం అయ్యారు. జయలలితతో భేటీ అనంతరం ఎన్నికల్లో అన్నాడీఎంకేకు తన మద్దతును ప్రకటించారు. కొన్ని కారణాలతో ఇది వరకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, అమ్మ దర్శనంతో అన్ని తొలగినట్టు పేర్కొన్నారు. మళ్లీ అమ్మ పాలన లక్ష్యంగా శ్రమిస్తానని స్పష్టం చేశారు.


 ఎదురుచూపుల్లో:  చిన్నా చితక పార్టీలకు, ఇది వరకు  టాటా చెప్పిన శరత్‌కుమార్ లాంటి వాళ్లకు అమ్మ దర్శనం లభిస్తుంటే, తనకు దక్కేది ఎప్పుడో అన్న వేదనలతో టీఎంసీ నేత జీకే వాసన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తమిళ మానిల కాంగ్రెస్‌ను(టీఎంసీ) పునరుద్ధరించిన జీకే వాసన్ అమ్మ నీడన చేరాలన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ఆ పార్టీ వర్గాల సంప్రదింపుల్లో 25 సీట్ల డిమాండ్‌ను అమ్మ ముందు ఉంచి ఆయన తప్పు చేసినట్టున్నారు.

ఇందుకు కారణం ఇప్పటి వరకు అమ్మ దర్శన భాగ్యం అందుకున్న పార్టీలందరికీ సింగిల్ డిజిట్ సీట్లు ఖారరయ్యాయని చెప్పవచ్చు. అయితే,  వాసన్ డబుల్ డిజిట్ సంఖ్యను ఉంచిన దృష్ట్యా, వేచి చూసే ధోరణిలో అమ్మ ఉన్నట్టు సమాచారం. తాము ఇచ్చే సీట్లతో సర్దుకునే వాళ్లకే పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకుని అమ్మ దర్శనం లభిస్తున్నదని, ముందే డిమాండ్లు పెడితే కష్టమేనంటూ అన్నాడీఎంకే వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అందుకే మరో రెండు మూడు రోజులు వేచి చూసి, తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు వాసన్ నిర్ణయించి ఉన్నారు. ఈనెలాఖరులోపు పొత్తు ఎవరితో అన్నది స్పష్టం చేస్తానని ఆయన మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


 20 మందికి ఒక ఇన్‌చార్జ్:  ఇంటర్వ్యూలు, మద్దతు, ఫిర్యాదుల పరిశీలన బిజీలో ఉన్నా, ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కొత్త వ్యూహాల్ని రచించే పనిలో జయలలిత ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ అధికారం లక్ష్యంగా ఉరకలు తీస్తున్న జయలలిత 20 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్ చొప్పున నియమించే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

ఒక్కో గ్రామంలో, ఆయా వీధుల్లో ఉన్న ఓటర్లను పరిగణలోకి తీసుకుని అక్కడి స్థానిక నేతల్ని ఇన్‌చార్జ్‌లుగా నియమించే పనిలో ఉన్నారు. ఈ ఇన్‌చార్జ్‌లుఆ ఓటర్లను కలవడం, వారి సమస్యల్ని తెలుసుకోవడం, వాటి పరి ష్కారం దిశగా ముందుకు సాగేందుకు  ‘రచ్చ బండ’ చర్చ అన్న నినాదాన్ని ఇందుకు ఎంపిక చేసి ఉండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement