
తమిళ రాజకీయాల్లో కలకలం
రజనీ వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చూపు
చెన్నై(తమిళసినిమా): అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చూపు రజనీపై పడుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తే అందులో చేరడానికి ఐదుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు రెడీగా ఉన్నారనే మీడియా ప్రచారం కలకలం రేపుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం ‘కాలా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఇటీవల తన అభిమానులను కలవడం, సమయం వచ్చినప్పుడు పోరుకు సిద్ధం కండని వారికి పిలుపు నివ్వడం వంటివి తమిళనాడులో ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.
దానికి తోడు ఇటీవల గాంధీ ప్రజా సంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్ రజనీకాంత్‌ను కలిసి అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం తథ్యం అని రజనీకి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల రజనీకాంత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు రజనీ పార్టీ పెడితే అందులో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజా ప్రచారం.
అదే విధంగా పన్నీర్‌సెల్వం, ముఖ్యమంతి ఎడపాడి పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్య నిర్వాహకులు రజనీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రజనీతో సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాలా షూటింగ్ కోసం ముంబైలో మకాం పెట్టిన రజనీకాంత్ వీరెవరినీ కలవడానికి సుముఖం వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నవారు తనతో రావొద్దని రజనీకాంత్ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.