‘డెప్యూటీ’ ఖాయం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వరుస విజయాలతో అన్నాడీఎంకే దూసుకు వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితోపాటుగా రాష్ట్రంలోని 40 స్థానాల్లో 37 స్థానాలను కైవశం చేసుకుంది. ఈ గెలుపుతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగేలా ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత అడుగులు వేస్తూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి నినాదం, తమిళ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కేంద్రంతో మైత్రీకి రెడీ అవుతున్నారు. డెప్యూటీ సీటు: జాతీయ స్థాయిలో మూడో పార్టీగా అవతరించడంతోపాటుగా రాజ్యసభలో 11 మంది సభ్యులను కలిగి ఉండడం అన్నాడీఎంకేకు కలసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్‌లో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం లేదు.
దీంతో ఏదేని కీలక ముసాయిదాలు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి వస్తే, అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి. ఈ దృష్ట్యా, ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. పార్లమెంట్‌లో ఇంత వరకు ప్రధానప్రతి పక్షం ఎవరికి అన్న విషయాన్ని స్పీకర్ సుమిత్ర మహజన్ ప్రకటించ లేదు. తమకు ఆ చాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా, వారికి ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ప్రధాన ప్రతి పక్షం లేకుండానే పార్లమెంట్ ముందుకు సాగుతున్నా, డెప్యూటీ స్పీకర్ ఎంపిక అనివార్యం అయింది. ఈ పదవి అన్నాడీఎంకేకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు సిద్ధం అయింది. సీఎం అంగీకారం : లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్‌కు సంబంధించి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నెలన్నర క్రితం సమాచారం పంపించారు.
ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చిన జయలలిత మంగళవారం అంగీకారం తెలపడంతో పార్టీ పార్లమెంటరీ నేత తంబిదురై నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తదితరులు నామినేషన్ పత్రానికి ఆమోదం తెలపడంతో ఇక, తంబిదురై డెప్యూటీ స్పీకర్ సీటులో కూర్చోవడం ఖరారైనట్టే. తంబిదురైకు డెప్యూటీ పదవి దక్కిన దృష్ట్యా, ఇక కేంద్రంలో అన్నాడీఎంకే, బీజేపీలు స్నేహ పూర్వకంగా మెలిగినట్టే. ఈ స్నేహం కేవలం కేంద్రానికే పరిమితం అయ్యేనా, లేదా రాష్ట్రంలోను సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, పార్టీ పార్లమెంటరీ నేతకు డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంతో, ఆయన చేతిలో ఉన్న పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఎదురు చూపులు అన్నాడీఎంకే ఎంపీల్లో బయలుదేరాయి. అయితే, అత్యధిక శాతం అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగు పెట్టిన వారే. ఒకరిద్దరు మాత్రమే సీనియర్లు ఉన్న దృష్ట్యా, వారిలో ఒకరికి పార్టీ ప్రతి పక్ష నేత పదవి వరించే అవకాశాలున్నాయి.