పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్‌సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్లమెంట్‌లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.
అయితే ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక.. పార్లమెంట్‌సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు.
లోక్‌సభ సమావేశాల్లో..
తొలుత భర్తృహరి మెహతాబ్‌తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్‌సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.
ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్‌సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.
డిప్యూటీ స్పీకర్ విషయంలో..
2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి
16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు
అయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది
Comments
Please login to add a commentAdd a comment