‘డెప్యూటీ’ గ్యారెంటీ!
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు రాష్ట్రంలో అన్నాడీఎంకే తన హవాను చాటుకుంది. 37 మంది ఎంపీల గెలుపుతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించింది. అలాగే, కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగే విధంగా ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదం, సమస్యలు, హక్కులను ఏకరువు పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాల్ని సంధిస్తూ, అమలు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
డెప్యూటీ పదవి: జాతీయ స్థాయిలో అత్యధిక ఎంపీలను కైవసం చేసుకున్న మూడో పార్టీగా అవతరించడంతోపాటుగా రాజ్యసభలో 11 మంది ఎంపీలను కలిగి ఉండడం అన్నాడీఎంకేకు కలసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్‌లో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం లేదు. దీంతో ఏదేని కీలక ముసాయిదాలు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే, అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి. ఈ దృష్ట్యా, ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు కొత్త ప్రభుత్వం రెడీ అవుతోంది. పార్లమెంట్‌లో ఇంత వరకు ప్రధాన ప్రతి పక్షం ఎవరికి అన్న విషయాన్ని స్పీకర్ సుమిత్ర మహజన్ ప్రకటించ లేదు.
తమకు ఆ చాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయితే, స్పీకర్ ఇంత వరకు తన నిర్ణయాన్ని వెల్లడించ లేదు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే పార్లమెంట్ ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు డెప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు సిద్ధమైంది. కాంగ్రెస్‌కు ఇప్పుడే ప్రధాన ప్రతిపక్షం హోదా కట్ట బెట్టిన పక్షంలో, వారికే డెప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పట్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతి పక్షం ఇవ్వకుండా, ముందుగా డెప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసే పనిలో స్పీకర్ సుమిత్ర మహజన్ ఉన్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
తంబిదురైకు చాన్స్ దక్కేనా : ఇప్పటికే డెప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్‌కు సంబంధించి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సమాచారం పంపినట్టు తెలిసింది. ఏదేని కీలక విషయాల్లో ఆచితూచి అడుగులు వేసే సీఎం జయలలిత, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో డెప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం తంబి దురైకు ఉంది. అలాగే, యూపీఏ హయాంలో ప్రొటెం స్పీకర్‌గా ఆయన వ్యవహరించారు. ఒక వేళ డెప్యూటీ స్పీకర్ పదవికి జయలలిత అంగీకరించిన పక్షంలో ఆ ఛాన్స్ ఎంపీ తంబిదురైకు దక్కేనా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో పార్టీ పార్లమెంటరీ నేత పదవి చాన్స్ ఏ ఎంపీకి దక్కుతుందో అన్న ఉత్కంఠ తప్పదు. తంబిదురైను డెప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి, పార్లమెంటరీ నేత పదవిని మరొకరికి జయలలిత కట్ట బెట్టేనా అన్న ఉత్కంఠకు మరి కొద్ది రోజుల్లో తెర పడనున్నది.