
మద్య నిషేధమే అస్త్రం
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధమే తమ అస్త్రమని డీఎండీకే ప్రకటించింది. న దీజలాల పరిరక్షణకు అఖిల పక్షానికి డిమాండ్ చేసింది. బీజేపీతోనే పయనం సాగిద్దామా? అన్న నిర్ణయంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. ఈ మేరకు కోయంబత్తూరు వేదికగా బుధవారం జరిగిన డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు.
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యే రీతిలో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సన్నద్ధమైంది. ఇందు కోసం పార్టీ వర్గాలు అభిప్రాయాలు, మనోగతాలను తెలుసుకోవడంతోపాటుగా కీలక నిర్ణయాలకు వేదికగా సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ మలచుకున్నారు. బీజేపీ కూటమిలో డీఎండీకే కొనసాగేనా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా కోయంబత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వ సభ్య సమావేశం, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సమావేశమైంది.
అభిప్రాయాలు
ఉదయాన్నే విజయకాంత్ నేతృత్వంలో జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సర్వ సభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు మొత్తంగా 285 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా నేతల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించారు. అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలో, అందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే రీతిలో నిర్వహించాల్సిన పనుల గురించి సమీక్షించారు. పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో విజయకాంత్ తన ప్రసంగాన్ని సాగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డ ఆయన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారును, డీఎంకేపై విమర్శల పర్వాన్ని తగ్గించడంతో ఆయన దారెటోనన్న చర్చ ఆరంభమైంది. అదే సమయంలో బీజేపీలో కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై మెజారిటీ శాతం మంది నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న దృష్ట్యా, ఇప్పటికిప్పుడే కూటమి విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అదే సమయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే సర్వాధికారాన్ని విజయకాంత్‌కు అప్పగిస్తూ తమ ప్రసంగాలను నాయకులు సాగించారు. శ్రీరంగం ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంగా తుది నిర్ణయాన్ని విజయకాంత్‌కు అప్పగించారు.
తీర్మానాలు
సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచినా, తీర్మానాలను మాత్రం ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇరవైకు పైగా తీర్మానాలు చేశారు. ఇందులో పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్ బాటలో తాజాగా, డీఎండీకే సైతం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలికావేరి నదీ జలాల పరిరక్షణకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. నదీజలాల విషయమై కేంద్రంతో సంప్రదింపులకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతంగా తీసుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎలాంటి నిర్ణయాల్ని అయినా తీసుకోవాలి. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వానికి ఖండన. దాడులకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రానైట్ స్కాంను విచారిస్తున్న సహాయం కమిటీకి పూర్తి సహకారం అందించడంతో పాటుగా స్వేచ్ఛను కల్పించాలని వినతి.విద్యుత్ చార్జీల పెంపు రద్దు, చెరకు మద్దతు ధరగా రూ.3500 పెంచాలి, కావేరి నది తీరంలో మీథైన్ తవ్వకాలకు వ్యతిరేకత, కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో రెండు, మూడు యూనిట్లపై నెలకొన్న ఆందోళన నివృత్తి, తదితర డిమాండ్‌లతో కొన్ని తీర్మానాలు చేశారు.తమిళ ప్రజల్ని ఆదుకునే విధంగా, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి నిధుల్ని సమకూర్చే విధంగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.