
బాసూ.. అవుతోంది మెమోరీ లాసు..!
అరె.. బైక్ కీ ఇక్కడే ఎక్కడో పెట్టానే.. ఎక్కడ పెట్టానబ్బా.. అంటూ వెతుక్కోవడం చాలామందికి జరుగుతూనే ఉంటుంది. మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టున్నాం. కానీ ఎక్కడో గుర్తుకు రావట్లేదు.. అని కూడా అంటుంటాం. అంతేకాదండోయ్..! ఒక్కోసారి మన బంధువుల పేర్లనే మరిచిపోతుంటాం. ఇవన్నీ సాధారణంగా అందరికీ ఎదురవుతుంటాయి. కానీ ఇంతకంటే ఎక్కువ విషయాలను మరిచిపోవడమంటే కచ్చితంగా మెమోరీ లాస్ అవుతున్నట్లే. శారీరక, మానసిక కారణాలతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మొదట్లోనే దీన్ని సీరియస్‌గా తీసుకొని వైద్యం చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు మానసిక వైద్యనిపుణులు.
న్యూఢిల్లీ: నేటి పోటీ ప్రపంచంలో మనిషి వేగంగా అభివృద్ధి చెందాలన్న ఆశతో ఎన్నో రకాల పనులను చేస్తున్నాడు. ఈ క్రమంలో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా డు. ప్రధానంగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న మానసిక వ్యాధుల్లో మెమోరీ లాస్ ఒకటి. దీనినే ఆల్జిమర్స్‌గా కూడా పిలుస్తున్నారు.
అల్జీమర్స్ అంటే..
మెదడులోని కొన్ని కణాలు పని చేయడం మానేస్తాయి. క్రమేపి చనిపోతాయి. ఈ కణాలు జ్ఞాపకశక్తి, భాష, ఇతర ఆలోచించే పనులకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలని అందించేవి. ఇవి తగ్గుతూ ఉంటే వ్యక్తి జ్ఞాపకశక్తి సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి సంతవ్సరాల తరబడి మెల్లమెల్లగా వస్తుంది. కొంతకాలం తర్వాత(5-8 ఏళ్లు) ఇది ఎటువంటి స్థితికి పురోగమిస్తుందంటే ఆ వ్యక్తి తనకి అవసరమైన ప్రాథమి క అవసరాలను కూడా గుర్తుపెట్టుకునే స్థితిలో ఉండడు.
ఎలా వస్తుంది..?
వయసు పెరుగుతున్నా కొద్దీ అల్జీమర్స్ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంటుంది. 65ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులను సంరక్షకులు బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యావసరాలను నిర్లక్ష్యం చేయడం వల్ల బాగా వ్యాకులతకి లోనవుతారు. తరచు జబ్బుపడతారు. ఈ వ్యాధిగ్రస్తులు బాగా తినాలి, నిద్రపోవాలి. క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి.
రాజధానిలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు
జీవన విధానంలో వచ్చిన పలుమార్పులు, పెరుగుతున్న యాంత్రికత, అనువంశిక కుటుంబాలు, మత్తు పదార్థాల బానిసత్వం వల్ల మతిమరుపు సమస్య పెరుగుతోందని న్యూరో-సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ప్రపంచ మతిమరుపు అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ.. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు, అల్జీమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. చాలామంది కుటుంబసభ్యులు మతిమరుపు మొదటి దశలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తారని తెలిపారు. కానీ ముందుగానే వైద్యులను సంప్రదిస్తే వైద్యచికిత్స ఫలితాలు వస్తాయన్నారు.
అల్జీమర్స్ వ్యాధి హెచ్చరికలు..
జ్ఞాపకశక్తి తగ్గుతుండటం
పరిచయం ఉన్న పనులని చేయడం
కష్టమవడం
మాట్లాడే భాషను సరిగా వినియోగించుకోలేకపోవడం
సమయం, ప్రదేశాల గురించి
మరిచిపోతుండటం
నిర్ణయం తీసుకోవడంలో లోపం లేదా
తగ్గుదల
వస్తువులను ఉండవల్సిన చోటులో
పెట్టకపోవడం
మూడ్‌లోను, ప్రవర్తనలోను మార్పులు
వ్యక్తిత్వంలో మార్పులు, చొరవ
తీసుకోవడం కోల్పోవడం.