కళంకితులను మంత్రి వర్గంలో చేర్చుకోవడంతో పాటు వారిని వెనకేసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ....
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కళంకితులను మంత్రి వర్గంలో చేర్చుకోవడంతో పాటు వారిని వెనకేసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని సమాజ పరివర్తన సముదాయం వ్యవస్థాపకుడు ఎస్‌ఆర్. హిరేమఠ్ ఆరోపించారు.
హుబ్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌ల అక్రమాలపై రెండు సార్లుగా తాము సాక్ష్యాధారాలను విడుదల చేసినప్పటికీ, మంత్రి వర్గంలో కొనసాగించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. రోషన్ బేగ్ వంచనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన ఆధారాలను ప్రదర్శించారు.
బెంగళూరులోని భారతీ నగర పోలీసు స్టేషన్‌లో దీనిపై కేసు కూడా నమోదైందని వెల్లడించారు. శివ కుమార్ భూ కబ్జాలకు సంబంధించి ముఖ్యమంత్రికి ఛార్జిషీట్ ప్రతులను పంపినా, ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని నిష్టూరమాడారు.