
'అమ్మ’ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్లు
చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా 'అమ్మ టూ వీలర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ల' ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే నెల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో తాను ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐడీఎంకే సుప్రీమో జయలలిత తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 35 కేంద్రాల్లో సెంటర్లను స్థాపించేందుకు సిద్ధం చేస్తున్నామని, ఒక్కో సెంటర్లో 30 మంది వరకూ అభ్యర్థులకు మూడు నెలల శిక్షణతో పాటు 3000 రూపాయల స్టై ఫండ్ చెల్లించనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 1.65 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
అలాగే 'సీమెన్స్', 'డిజైన్ టెక్' లతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద.. రూ. 546,84 కోట్ల అంచనా వ్యయంతో ఓ ఎక్సలెన్స్ సెంటర్ తో పాటు, ఐదు నైపుణ్యాభివృద్ధి ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.