అనుకోకుండా ఎడిటర్‌నయ్యా! : అనిల్ మల్నాడ్
‘వంశవృక్షం’ చిత్రంతో ఆయన ఎడిటర్‌గా చలన చిత్రసీమకు సుపరిచితులయ్యారు...నాటి నుంచి దర్శకుడు బాపు ప్రతి చిత్రంలోనూ ‘ఎడిటర్ - అనిల్ మల్నాడ్’ పేరు తప్పనిసరైంది... వంశీ తీసిన ‘సితార’ చిత్రానికి 1985లో ‘ఉత్తమ ఎడిటర్’ జాతీయ పురస్కారం అందుకున్నారు. పలు భాషా చిత్రాలకు ఎడిటర్‌గా నేటికీ చురుగ్గా పనిచేస్తున్నారు... మీడియాకు, పబ్లిసిటీకి దూరంగా ఎంతో సింపుల్‌గా ఉండే ఎడిటర్ అనిల్ మల్నాడ్‌తో సాక్షి ప్రత్యేక సంభాషణ...
సాక్షి: ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం?
అనిల్: నా 17వ యేట 1970లో బాపు గారి దగ్గర ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి అసిస్టెంట్‌గా చేరాను. సినిమాటోగ్రఫీలో చేరడం కోసం చెన్నై వచ్చాను. కాని అందులో సీటు దొరకకపోవడంతో ఎడిటింగ్‌లో చేరాను. ఆ వయసులో నాకు ఏ రంగం ఎంచుకోవాలో కూడా తెలియదు. ఏదో ఒక దానిలో చేరిపోవాలి అంతే!
సాక్షి: ఈ రంగురంగుల మాయా ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు తిరుగు లేకుండా ఎలా ఉండగలిగారు...
అనిల్: వృత్తిని దైవంగా భావించాను. నా క్రమశిక్షణ, సిన్సియారిటీల వల్లే ఇన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో ఉండగలుగుతున్నాను.
సాక్షి: మీరు పని చేసినవారిలో మీకు బాగా న చ్చిన దర్శకులు.
అనిల్: అందరూ నచ్చినవారే. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. బాపు, వంశీ, గీతాకృష్ణ, రాఘవేంద్రరావు... చాలామంది దర్శకులతో పనిచేశాను. తమిళంలో ఆర్‌వీ. ఉదయ్‌కుమార్, ఆర్.కె.సెల్వమణి... వీరిద్దరికీ ఎక్కువ చేశాను. ఇం కా మణివణ్నన్, మనోబాల... వీరు నన్ను ఇష్టపడేవారు.
సాక్షి: ఒక భాషలో పని చేయడమే కష్టం. అటువంటిది ఇన్ని భాషలు నేర్చుకుని, ఎలా పని చేయగలుగుతున్నారు?
అనిల్: చదువుకునే రోజుల్లోనే కన్నడ, తుళు, కొంకిణి, తమిళం, తెలుగు, హిందీ భాషలు నేర్చుకున్నాను. నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు అని పెద్దలు చెప్పినట్లుగా, ఆనాడు నేను నేర్చుకున్న భాషలు నాకు ఈ రోజు ఈ విధంగా ఉపయోగపడ్డాయి. పని చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం.
సాక్షి: మీ పేరుకు ఎందుకు మార్చుకున్నారు? మీరు సంఖ్యాశాస్త్రాన్ని కాని, జాతకాన్ని కాని నమ్ముతారా...
అనిల్: నా అసలు పేరు జి.ఆర్. దత్తాత్రేయ. తమిళులు ‘దత్తాత్రేయ’ పదం పలకలేకపోయారు. అందువల్ల సులువుగా ఉండేలా అనిల్ దత్ అని పిలిచేవారు. నేను పుట్టిన ప్రాంతం పేరు ‘మల్నాడు’ ఆ ప్రాంతం పేరును కలుపుకుని ‘అనిల్ మల్నాడ్’గా స్థిరపడ్డాను. అంతేకాని నాకు దేని మీదా నమ్మకం లేదు.
సాక్షి: ఎడిటింగ్‌లో మీ గురువు ఎవరు?
అనిల్: అక్కినేని సంజీవ్ (ఎల్.వి.ప్రసాద్ తమ్ముడు), మందపాటి రామచంద్రయ్య.
సాక్షి: ఎడిటింగ్ చేసేటప్పుడు మీతో ఎవరెవరు ఉంటారు?
అనిల్: సినిమాలో మొత్తం 24 ఫ్రేమ్స్ ఉంటాయి. అందు లో ఎడిటింగ్ కూడా ఒకటి. ఎడిటింగ్ చేయడంలో తేడా వస్తే మాత్రం కథను అర్థం చేసుకోవడం కష్టం. సాధారణంగా ఎడిటింగ్ చేసేటప్పుడు మాతో పాటు డెరైక్టర్, కో డెరైక్టర్ ఉంటారు. వాళ్లు దగ్గర ఉంటేనే పని సులువవుతుంది.
సాక్షి: అన్నిశాఖలూ కలిస్తేనే సినిమా విజయవంతమవుతుం ది. క్రెడిట్ అంతా హీరోలకే వెళ్తుంది కదా! ఏమంటారు?
అనిల్: తెర వెనుక పని చేసేవాళ్లు ఎలా ఉంటారో సామాన్య ప్రజలకు తెలియదు. కాని నటీనటులను వెండి తెర మీద చూస్తారు కనుక వారిని వెంటనే గుర్తించగలుగుతారు. వాళ్లకు వచ్చే ప్రశంసలన్నీ మాకు వచ్చినట్లే కదా.
సాక్షి: బ్లాక్ అండ్ వైట్‌కి, రంగుల సినిమాకి ఎడిటింగ్‌లో ఏమైనా తేడా ఉంటుందా?
అనిల్: ప్రస్తుతం కంప్యూటర్ విధానం రావడం వల్ల పని తేలికైపోయింది. ఆరుగురు చేసే పనిని ఒక్కరు చేసేస్తున్నాం. ఎడిటింగ్ విషయంలో రంగులు, నలుపు తెలుపు తేడా లేదు.
సాక్షి: మీలాగ ఇన్ని భాషలకు పనిచేసిన వారు ఇంకా ఉన్నారా?
అనిల్: నాలుగైదు భాషల్లో మాత్రమే పని చేసేవారున్నారు. ఇన్ని భాషలు చేసిన వారు పెద్దగా లేరు.
సాక్షి: తెలుగులో ఎక్కువ చిత్రాలు బాపు, వంశీ గార్లతో పనిచేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా?
అనిల్: బాపుగారి పది సినిమాలకు పని చేసిన తర్వాత, వంశీగారు ఏడిద నాగేశ్వరరావుగారి ద్వారా నన్ను పిలిచారు. ఆ తరవాత గీతాకృష్ణ కూడా నాతో చేయించుకున్నారు. నేను బాపుగారి దగ్గర సమయపాలన నేర్చుకున్నాను కనుక వారు కూడా నా విషయంలో సమయపాలన పాటించారు.
సాక్షి: కన్నడదేశంలో పుట్టి, తమిళదేశం వచ్చి, తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని భాషలు మాట్లాడగలుగుతున్నారు. మీ ప్రయాణం గురించి వివరించండి.
అనిల్: నా ప్రయాణం తెలుగు సినిమాలతో మొదలైంది, తెలుగు సినిమా నాకు తల్లిలాంటిది. నాకు అవార్డులు తెచ్చిందీ తెలుగు సినిమానే. బాపుగారికి నేను పెద్ద కొడుకుతో సమానం. ఆయనతో మొత్తం 22 సినిమాలకు పని చేశాను. ఇంత ఎదగడానికి కారణం బాపురమణలే. నాకు వాళ్లు సినిమా మనుషుల్లాగ అనిపించరు. అంత సింపుల్‌గా ఉంటారు వాళ్లు. నేను బయట పబ్లిసిటీకి రాకపోవడానికి కారణం కూడా అదే. వారి నుంచే ఆ లక్షణం నాకు వచ్చిందనుకుంటాను.
సాక్షి: నంది అవార్డు అందుకున్న సినిమా గురించి...
అనిల్: మొట్టమొదటి జాతీయ అవార్డు వంశీ తీసిన ‘సితార’ చిత్రానికి 1984లో నాటి రాష్ట్రపతి జైల్‌సింగ్ చేతుల మీదుగా అందుకున్నాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. అసలు అవార్డు గురించి తెలుసుకునేంత జ్ఞానం కూడా అప్పుడు నాకు లేదు. దక్షిణాది వారికి జాతీయ అవార్డు రావడం చాలా విశేషం. దేవుడి దయ వల్ల నాకు వచ్చింది. అంతే.!
సాక్షి: బాపుగారితో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?
అనిల్: బాపుగారి దగ్గర అసిస్టెంట్‌గా మొదలుపెట్టిన నాటి నుంచి ఆయన నన్ను దగ్గరగా చూశారు. పని పట్ల నాకున్న నిబద్ధతను గమనించిన ఆయన, వంశవృక్షం చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టమని స్వయంగా ఆదేశించారు. ఆయన మాట కాదనలేక అంగీకరించాను. ‘అనిల్ మల్నాడ్‌తో ఎడిటింగ్ అంటే 10 నిమిషాలుముందే ఉండాలి’ అని ఆయనతో అనిపించుకున్నాను. ఆయన నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన నా విషయంగా అలా మాట్లాడడం ఆనందంగా అనిపించింది
అనిల్ మల్నాడ్ మనసులో మాటలు...
బాపుగారి దగ్గర ఒక్క సినిమా చేసినా
ఆస్కార్ అవార్డు వచ్చినట్లే.
‘మంచుపల్లకీ’ చూసి, ‘నీకు మంచి ఎడిటర్
దొరకడం ప్లస్ పాయింట్’ అని వంశీకి
కాంప్లిమెంట్ ఇచ్చారట.
నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు
‘భారతీరాజా’ నన్ను అభినందించారు.
బాపుగారితో 13 సినిమాలకు ఎడిటర్‌గా,
10 సినిమాలకు అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశా.
బాపు తీసిన ‘త్యాగయ్య’ చిత్రంలోని
56 కీర్తనలను బవరుసలో చెప్పాను.
బాపు ఆశ్చర్యపోయారు.
‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో రుషి
కుమారుడి వేషం వేయమని బలవంతం చేశారు.
నేను ‘ఈ గెటప్‌లో అయితే చేస్తాను’ అని నేను వేసుకున్న బట్టలు చూపించాను.
‘వద్దు’ అనేశారు.
ఆ వేషం వేసి ఉంటే, లైఫ్ వేరేగా ఉండేదేమో.
- (సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, చెన్నై)