త్వరలో మరో ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శ్రీకారం చుట్టనున్నారు.
పింప్రి, న్యూస్‌లైన్: త్వరలో మరో ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల కోసం పనిచేయని, ప్రజల మాట వినని నాయకులను వెనక్కు తీసుకువచ్చే చట్టం ‘రైట్ టు రీకాల్’ కోసం త్వరలో ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘లడో లోక్‌పాల్ ఛా.. ఉద్రేక్ ఆమ్ ఆద్మీ ఛా’ పుస్తకాన్ని పుణేలో సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా హజారే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి జనశక్తి బలమేంటో చూపించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే సూచన కనిపించడం లేదన్నారు.
యువ శక్తి ఈ ఎన్నికలలో ముఖ్య భూమికగా నిలుస్తుందన్నారు. ఎన్నికల్లో నోటు ద్వారా అధికారానికి వచ్చి ప్రజల బాగోగులను మరిచి, ఐదు సంవత్సరాల వరకు నియోజకవర్గంవైపు చూడని ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అధికారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ‘వెనక్కు పిలిచే’ హక్కును కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ హక్కు కోసం త్వరలో త్వరలో ఆందోళన చేస్తామని, ప్రజలే దేశానికి యజమానులని, అభివృద్ధి అనేది కిందిస్థాయి నుంచి జరగాలని, ఈ విషయంపై ప్రజల్లో జన జాగృతి కల్పిస్తానని ఆయన తెలిపారు. మరో నెలరోజుల్లో ఆందోళనకు సిద్ధమవుతానని తెలిపారు. ఇదిలావుండగా హజారే ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ధనంజయ విజలే రచించారు. ఈ కార్యక్రమంలో స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు రాజుశెట్టి, డాక్టర్ విశ్వంభర్ చౌదరి, అవినాష్ ధర్మాధికారి, సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతటి పెద్ద ఉద్యమంగా మారిందో తెలిసిందే. హాజరే దీక్షకు దిగివచ్చిన కేంద్రం ఎట్టకేటకు జన్‌లోక్‌పాల్ బిల్లును రూపొందించి, అమల్లోకి కూడా తెచ్చింది. కాగా తాజాగా హజారే ప్రాంభించనున్న ఉద్యమం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.