
కష్టాల్లో మాజీ మంత్రి
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి కటకటాల వెనుక కాలం గడుపుతున్న మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి మరో కష్టం వచ్చి పడింది. పుండుమీద పుట్రలా మరో ఆరోపణల పిడుగు నెత్తినపడింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:తిరునెల్వేలి జిల్లా వ్యవసాయాధికారి ముత్తు కుమారస్వామి గత ఏడాది రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, ఇందుకు బాధ్యుడిని చేస్తూ అప్పటి వ్యవసాయశాఖా మంత్రి అగ్రికృష్ణమూర్తిని ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. సీబీసీఐడీ చేపట్టిన విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో అగ్రికృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు. బెయిల్ కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేయగా ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.
అధికధరకోసం బెదిరింపులు: వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేసే ఎరువులను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిందిగా అగ్రి కృష్ణమూర్తి తనను ఒత్తిడి చేశాడని రిటైర్డు అధికారి జయసింగ్ జ్ఞానదురై (58) ఆరోపించాడు. శుక్రవారమే ఉద్యోగ విరమణ చేసిన జయసింగ్‌కు మదురైలో వీడ్కోలు సభను నిర్వహించారు. సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో తాను అనేక ఆటుపోట్లకు గురైనానని, ముఖ్యంగా మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి సంఘటనను ఉదహరించారు. శాఖాపరంగా ఎరువుల కొనుగోలుకు గత ఏడాది డిసెంబరులోనే ఆర్డరు పెట్టగా, ఈ విషయం తెలియని సదరు మాజీ మంత్రి..అధిక ధరకు ఎరువు కొనుగోలు చేసేలా ఆర్డరుపై సంతకం పెట్టాలని కోరాడని చెప్పాడు.
అసలు ధర కిలో *60 కాగా *120 కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారని తెలిపాడు. అయితే ఇందుకు తాను అంగీకరించక పోవడంతో మధురై నుండి చె న్నైకి బదిలీ చేస్తానని బెదిరించాడని చెప్పారు. అయినా తాను ససేమిరా అనడంతో మరో మంత్రి సహచరుడు ఫోన్ చేసి మంత్రి మాట్లాడాలని కోరుతున్నాడని సందేశం పంపాడని అన్నారు. అయినా మంత్రి ఆదేశాలకు తాను లొంగకుండా సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశానని తెలిపాడు. జిల్లా కలెక్టర్ మొదలుకుని ఉన్నతాధికారులు అందరూ తనకు అండగా నిలిచినందునే మంత్రి మాటలను ధిక్కరించగలిగానని కృతజ్ఞతలు తెలిపాడు. పీఎంకే రాందాస్ తాజా ఆరోపణలకు స్పందిస్తూ, న్యాయవిచారణ జరిపితే అగ్రి కృష్ణమూర్తి అవినీతి అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తాయని రాష్ట్రప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. బెయిల్ మంజూరుకాక అసలే బెంగపడిపోయి ఉన్న మాజీ మంత్రి వర్యులకు మరో పిడుగుపాటులా కొత్త ఆరోపణలు చుట్టుకున్నాయి.