
ప్రతిధ్వనించిన ఆర్కావతి
బెంగళూరు ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయం శాసనసభలో మంగళవారం ప్రతిధ్వనించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారతీయ జనతా పార్టీ శాసనసభ నాయకుడు జగదీష్ శెట్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య హస్తం ఉందన్నారు. ఈ విషయమై జుడిషియల్ ఎంక్వెరీ జరుగుతున్న సమయంలో డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దస్త్రాలల్లోని సమాచారం మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈ విషయమై ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని శెట్టర్ పేర్కొన్నారు. ఈ సమయంలో మధ్యలో ప్రవేశించిన సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘దస్త్రాల్లోని విషయాలను మార్చడానికి సాధ్యమవుతుందా? కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీకు తెలుస్తుందా లేదా? డీ నోటిఫికేషన్ విషయమై దర్యాప్తు చేస్తున్న కెంపయ్య కమిషన్ అడిగిన రూపంలో (ఫార్మట్)లో దాఖలాలు ఇవ్వడానికి కొంత ఆలస్యమవుతోంది. అంతలోనే ఇలా ఆరోపణలు చేయడం సరికాదు.’ అని పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఒత్తాసు పలికారు