
జైట్లీ వెటకారంగా మాట్లాడారు: ఉండవల్లి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. హోదా అవసరం లేనప్పుడు పార్లమెంట్ లో ఎందుకు అడిగారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ’మీట్ ది ప్రెస్’లో అరుణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు అబద్దాలు మాట్లాడి దొరికి పోయారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో వెంకయ్య గట్టిగా పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా హామీతోనే టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. విభజనతో పరిశ్రమలన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయని చెప్పారు. ఏపీ రెవెన్యూ లోటును ఏవిధంగా భర్తీ చేస్తారో కేంద్రం చెప్పడం లేదని వాపోయారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనతో స్వయంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సింగ్ చెప్పారని వెల్లడించారు. ఆర్థికంగా వెనుబడిన రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని రఘురామ్ రాజన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెటకారంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.