
కొందరికే ఎలా తెలుస్తుంది: ఉండవల్లి
రాజమహేంద్రవరం: గోప్యంగా ఉంచాల్సిన సమాచారం కొందరికే ఎలా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదాయ వెల్లడి పథకం-2016 వివరాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన లేఖ రాశారు.
ఐడీఎస్-2016 జాబితా అధికారికంగా విడుదల చేయలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) స్పష్టం చేసిన నేపథ్యంలో... తనకు సమాచారం తెలిసిందని చంద్రబాబు ఎలా ప్రచారం చేసుకుంటారని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి చంద్రబాబుకు అధికారికంగా సమాచారం ఇచ్చారా అని అడిగారు. సమాచారం ఇవ్వనప్పుడు చంద్రబాబు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారని నిలదీశారు. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.