
‘ఆ భయంతోనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదా?’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దగా చేయబడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామిని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని వాగ్దానాలను అమలు చేయకుండా ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు నిజాలు వెల్లడించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- జైట్లీ, చంద్రబాబు ప్రకటనతో ఏపీ ప్రజలు మరోసారి దగా పడ్డారు
- ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు
- ఆంధ్రప్రదేశ్ స్టేటస్ భారతదేశంలో ఏంటి?
- ఏపీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు
- కంటితుడుపుగా చేసిన విభజన చట్టంలోని వాటిని కూడా అమలు చేయడం లేదు
- అప్పటి ప్రభుత్వం ఇచ్చిన మరింత మెరుగుపరిచి అమలు చేస్తామని బీజేపీ నేతలు అన్నారు
- ఏదో ప్యాకేజీ ఇస్తారట... ఎలా నమ్మమంటారు?
- కన్సలిడేట్ ఫంఢ్ నుంచి 10 వేల కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వాలని రాజ్యసభలో వెంకయ్య పట్టుబట్టారు
- అప్పటి ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామని వెంకయ్య అన్నారు
- 2014-15 లోటును కేంద్రబడ్జెట్ లో పెట్టి భర్తీ చేస్తామని హామీయిచ్చారు.
- బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇవాల్టీకి లోటును భర్తీ చేయలేదు
- ప్యాకేజీ ఇస్తారట.. ఇది కంటితుడుపు మాత్రమే
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత రాష్ట్రానికి ఎలా ఇస్తారు
- పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలంటే చట్టసవరణ చేసి తీరాలి
- చంద్రబాబును సంతృప్తి పరిచేందుకే కేంద్రం ప్రకటనలు చేస్తోంది
- ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదని అంటున్నారు.. ఇంతకన్నా బూతు మాట మరోటి ఉండదు
- ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ పెట్టిన బిల్లును రాజ్యసభలో ఎవరూ వ్యతిరేకించలేదు
- కేంద్రం ఎందుకు మోసం చేస్తోంది
- ప్రత్యేక హోదాపై జైట్లీ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు
- లోటు భర్తీ చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీకి గతిలేదు, ప్యాకేజీ ఇస్తారా?
- ప్రత్యేక హోదా సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది
- హైదరాబాద్ లో ఏపీకి సమాన అవకాశాలుంటాయని విభజన చట్టంలో ఉంది
- హైదరాబాద్ గురించి మాట్లాడితే కేసీఆర్ ఏం చేస్తాడోనని చంద్రబాబుకు భయం
- ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు
- ఇద్దరి మధ్య అండర్ స్టాండింగా లేక బ్లాక్ మెయిలా?
- గుజరాత్ లో ఉన్న పరిశ్రమలు ఏపీకి వస్తాయన్న భయంతో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదేమో
- చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకపోయినా చంద్రబాబు అడగరా
- చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి