ఆ నిర్ణయం సమష్టిగా తీసుకున్నాం
Published Mon, Apr 14 2014 11:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం తప్పేనని అంగీకరించిన ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ఈ వివాదంపై మరింత వివరణ ఇచ్చారు. సదరు నిర్ణయం తాను ఒక్కడినే తీసుకోలేదని, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమోదంతోనే అలా చేశామని పేర్కొన్నారు. ‘మేం హఠాత్తుగా రాజీనామా చేశామన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాను. విధానసభ కార్యకలాపాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించాయి. అప్పుడే మేం రాజీనామాలు సమర్పించాం. ఈ నిర్ణయం ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించింది. మేం మూడు నాలుగు రోజుల వేచిచూసి ప్రజలకు నచ్చజెప్పాక ఈ పని చేసి ఉండే బాగుండేది. సమాచార అంతరం వల్లే ఇలా జరిగి ఉంటుంది’ అని కేజ్రీవాల్ అన్నారు.
జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి నిర్వహించిన గూగుల్ హ్యాంగౌట్‌లో మాట్లాడుతూ ఆయన పైవిషయాలు చెప్పారు. అయితే ప్రజలు మొదట్లో ఆగ్రహంగా ఉన్నా, ఇప్పుడు ఆప్‌ను అర్థం చేసుకొని మళ్లీ మద్దతు ఇస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీని ఓడించేందుకు గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముక్తార్ అన్సారీ మద్దతు తీసుకుంటున్నారన్న ఆరోపణలు తిరస్కరించారు. సెక్యులర్ ఓట్లు చీలిపోవద్దనే ఉద్దేశంతోనే ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారని వార్తలు వచ్చాయి. ఆయనతో తాను ఎప్పుడూ సమావేశం కాలేదని, మద్దతూ తీసుకోలేదని వివరణ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరణ పూర్తిగా అన్సారీ నిర్ణయమేనని, ఈ విషయంలో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉంటే ఆప్ కార్యకర్తలు పలువురు అమేథీ లోక్‌సభ స్థానంలో ప్రచారం చేయడానికి వెళుతున్నారని కేజ్రీవాల్ ప్రకటించారు.
Advertisement