సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయా లేక ప్రభుత్వం ఏర్పాటవుతుందా అన్నది ఇంకా స్పష్టంగా తేలనప్పటికీ మూడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30లోగా ఎన్నికలు జరిపించవలసి ఉంది. కృష్ణానగర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్, మెహ్రోలీ నుంచి గెలిచిన ప్రవేశ్ వర్మ, తుగ్లకాబాద్ నుంచి గెలిచిన రమేష్ బిధూడీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేసి గెలిచి, అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిపించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీని త్వరగా రద్దుచేయనట్లయితే నవంబర్ 30 లోగా ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిపించవలసి ఉంటుంది.
ఈ మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపైనే ఢిల్లీ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా లేక ఎన్నికలు జరిపించాలా అన్నది బీజేపీ నిర్ణయిస్తుందని వారు అంటున్నారు. రాజధానిలోని మూడు పార్టీల దృష్టి ఈ మూడు నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపైనే ఉందని వారు అంటున్నారు. గతంలో గెలిచిన మూడు సీట్లను తానే గెలిచి తన పట్టు చెక్కుచె దరలేదని నిరూపించుకోవాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో చవిచూసిన ఘోరపరాజయంతో దెబ్బతిన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఈ మూడు సీట్లు గెలిచి ఢిల్లీలో మళ్లీ పట్టు సాధించాలన్న సంకల్పంతో ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పరాజయం పాలైన కాంగ్రెస్ మళ్లీ తన బలాన్ని పుంచుకునే ప్రయత్నాలలో ఉంది. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపడం కోసం మూడు సీట్లలో మిగిలిన రెండు పార్టీలకు గట్టిపోటీనివ్వాలని భావిస్తోంది.
శాసనసభ్యులు రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరిపించాల్సి ఉంటుందని, అందువల్ల నవంబర్ 30లోగా ఎన్నికలు జరగాలని ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్ దేవ్ చెప్పారు. అయితే అప్పటిలోగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపితే ఉప ఎన్నికల అవసరం ఉండదని ఆయన వివరించారు. కాగా, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఆమ్‌ఆద్మీ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు జరగ్గానే తాము సర్కార్‌ను ఏర్పాటుచేస్తామని గతంలో ఎల్జీకి ఆప్ లేఖ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోకపోవడం వల్లే అసెంబ్లీ రద్దుకు అవాంత రాలు ఏర్పడుతున్నాయని విమర్శించింది. అయితే ఓటమి భయంతోనే బీజేపీ అసెంబ్లీ రద్దుకు వెనకడుగు వేస్తోందని ఆప్ దుయ్యబడుతోంది.
ఉప ఎన్నికలపైనే చూపు..
Published Thu, Aug 7 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement