ముప్పేట దాడి
- అత్యాచార ఘటనలపై అట్టుడికిన అసెంబ్లీ
- ఇంటా బయట ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
- హోం శాఖ మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు
- వాయిదా తీర్మానాన్ని కోరుతూ ధర్నా - బీజేపీ సభ్యుల వాకౌట్
- కెంగల్ హనుమంతయ్య విగ్రహం వద్ద కమలనాథుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలకు నిరసనగా ప్రభుత్వానికి ఇంటా, బయటా పోరు ఎక్కువవుతోంది. మహిళల రక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ర్ట ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. నిన్నటి వరకు మౌనంగా ఉన్న జేడీఎస్ ఈ ఆందోళనలో బీజేపీతో కలవడం విశేషం. సాధారణంగా శాసన సభలో శుక్రవారం హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యేలందరూ తమ సొంత ఊర్లకు వెళ్లే పనిలో ఉంటారు.
అందుకే మధ్యాహ్నం వరకే సమావేశాలుంటాయి. నగరంలో పీజీ విద్యార్థిని, ఒకటో తరగతి బాలికలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి రాష్ట్రం భగ్గుమంటోంది. దీనిపై శాసన సభలో బీజేపీతో పాటు జేడీఎస్‌లు వాయిదా తీర్మానాన్ని కోరుతూ ధర్నా చేయడం, తదనంతరం బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో సభ వెలవెలబోయింది. ఉన్నత విద్యా శాఖ పద్దులపై జరిగిన చర్చకు మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే సమాధానమిస్తున్న తరుణంలో పాలక, ప్రతిపక్ష బెంచీలు ఖాళీగా కనిపించాయి. సభలో ఉన్న కొద్ది మంది సభ్యులతోనే స్పీకర్ కాగోడు తిమ్మప్ప, విద్యా శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు మమా అనిపించారు.
సభ వెలుపలా బీజేపీ ఆందోళన
సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు శాసన సభ ఆవరణలోనే ఉన్న కెంగల్ హనుమంతయ్య విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ ఎమెల్సీలు కూడా వారికి తోడయ్యారు. అందరూ నల్ల కండువాలను ధరించి ధర్నాలో పాల్గొన్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హోం మంత్రి కేజే. జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంకు మహిళా ఎమ్మెల్యేల వినతి
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను సమర్థవంతంగా అరికట్టేందుకు పదునైన చట్టాన్ని రూపొందించాల్సిందిగా పార్టీల రహితంగా మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శుక్రవారం కోరారు. శాసన సభ సమావేశాల సందర్భంగా లాబీలోని ఆయన కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై లైంగిక దౌర్జన్యాలను నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను బలోపేతం చేయడానికి సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతల శెట్టి ృేతత్వంలో శారద మోహన శెట్టి, వినిశా నెరో, పూరియ నాయక్, శశికళ జొల్లె, రామక్కలు ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో ఉన్నారు.