- పరిస్థితిని సమీక్షించి సర్వీసులను పునరుద్ధరిస్తాం
- నాలుగు అండర్‌పాస్‌లు, 31 రహదారుల అభివృద్ధికి చర్యలు
- రాష్ట్ర రవాణశాఖ మంత్రి రామలింగారెడ్డి
కృష్ణరాజపురం : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో అన్నా డీఎంకే కార్యకర్తలు అభిమానులు ఆవేశంతో బస్సులపై దాడులు చేయవచ్చని భావించి ముందుజాగ్రత్త చర్యగాతమిళనాడుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సు సర్వీస్‌లను నిలిపి వేసినట్లు రాష్ట్ర రవాణశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మహాదేవుపుర, కృష్ణరాజపురం నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన బీబీఎంపీ మేయర్ శాంతకుమారితో పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం నాటి పరిస్థితిని బట్టి సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. 18 నెలలో బీబీఎంపీ పరిధిలో సుమారు 17 కిలో మీటర్ల మేర 4 అండర్ పాసులతో పాటు 31 రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మహాదేవుపురంలో ఐటీ,బీటి సంస్థలూ ఎక్కువగా ఉండటంతో జన సంచారం అధికమై ట్రాపిక్ సమస్య తలెత్తుతోందన్నారు. వర్తూరు హోడి వరకు సిగ్నల్ ప్రీ రోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 2 వందల ఐటీ సంస్థలతో చర్చలు జరిపి వారి సహకారంతో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
కృష్ణరాజపురం ప్రభుత్వ డిగ్రి కళాశాలకు సమావేశం భవన నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధుల కోసం బీబీఎంపీ మేయర్ సహాకారం కోరుతామని మంత్రి తెలిపారు. టిన్ ప్యాక్టరీ సమీపంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బైరతి బసవరాజుతో చర్చిస్తామన్నారు. మేయర్ శాంతకుమారి మాట్లాడుతూ హొరమావు రైల్వేక్రాసింగ్ వద్ద అండర్ పాస్ నిర్మానం కొసం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
అనుమతి లభిస్తే బీబీఎంపీ, రైల్వే భాగస్వామ్యంతో అండర్‌పాస్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బసవరాజు, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మహేదేవుపుర బీబీఎంపీ జేసి దేవరాజు, బీబీఎంపీ కార్పొరేటర్లు పూర్ణిమా శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, అంజీనేయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారాయణస్వామి, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు.