అయేషా దంపతుల అరెస్ట్ | Ayesha couple 2 - | Sakshi
Sakshi News home page

అయేషా దంపతుల అరెస్ట్

Published Thu, Nov 14 2013 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

Ayesha couple 2 -

 = మోడీ టార్గెట్‌గా పాట్నాలో జరిగిన పేలుళ్ల కేసు ...
 = న్యాయస్థానంలో హాజరు పర్చిన పోలీసులు
 = అనుమతితో కస్టడీలోకి తీసుకున్న బీహార్ పోలీసులు
 = పాట్నాకు నిందితుల తరలింపు
 = వివిధ ప్రాంతాల్లోని ఉగ్రవాదులతో వీరికి లింకు
 = అయేషా ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా నగదు
 = పని మనిషి నుంచి కోట్లకు పడగలెత్తిన వైనం
 = 35 బ్యాంకు ఖాతాలు, 25 ఏటీఎం కార్డుల స్వాధీనం

 
బెంగళూరు, న్యూస్‌లైన్ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మంగళూరుకు చెందిన అయేషా భాను అలియాస్ ఆశ అలియాస్ ఇందిరా, ఆమె భర్త జుబేర్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం వారిని మంగళూరులోని మూడవ జే ఎంఎఫ్‌సీ న్యాయస్థానం ముందు హాజరు పరిచినప్పుడు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బీహార్ పోలీసులు చేసిన అభ్యర్థనను న్యాయాధికారి ఆమోదించారు.

దరిమిలా వారిద్దరూ ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నాకు తీసుకెళ్లారు. అయేషా స్వగ్రామానికి చెందిన రఘు, ఉదయ్‌కుమార్ అనే ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి సహాయంతో ఆయేషా ఎస్‌బీఎం, ఎస్‌బీఐలలో నకిలీ ఖాతాలను ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. అయేషా వద్ద నకిలీ పాన్ కార్డు కూడా ఉంది. ఆమె ఖాతాల్లో రూ. 5 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తేలింది. ఆమె ఇంటిలో తొమ్మిది మొబైల్ ఫోన్లు, 35 బ్యాంకు పాస్‌బుక్కులు, 25 ఏటీఎం కార్డులనూ స్వాధీనం చేసుకున్నారు. హవాల సొమ్ము రఘు, ఉదయ్‌కుమార్‌ల ఖాతాలలో జమైంది.

అనంతరం అయేషా ఖాతాలకు బదిలీ అయింది. దీనికి ప్రతిఫలంగా ఇద్దరికి మొత్తంలో 10 శాతం ముట్టింది. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఉగ్రవాదులకు ఆయేషా, జుబేర్‌లు నగదు సరఫరా చేశారు. జుబేర్ వ్యాపారం నిమిత్తం దుబాయ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఉగ్రవాదులతో పరిచయమైంది. వారు పంపే నగదు అయేషా, మిగిలిన ఇద్దరి ఖాతాల్లో జమ అయ్యేది. పాట్నాలో వరుస పేలుళ్లు సృష్టించిన వారికి అయేషా నగదు సహాయం చేసినట్లు బీహార్ పోలీసులు ఆధారాలు సేకరించారు.
 
 పని మనిషి నుంచి కోట్లకు పడగలెత్తిన అయేషా

 కొడగు జిల్లా కేంద్రం మడికేరి సమీపంలో ఉన్న విరాజ్‌పేట శివార్లలోని దేవణగెరె గ్రామంలో నివాసం ఉంటున్న భీమయ్య కుమార్తె అయేషా. ఏడో తరగతి వరకు అదే గ్రామంలో చదువుకుంది. మడికేరిలోని పొత్తోలిలో జుబేర్ బంధువులు నివాసం ఉంటున్నారు. వారి ఇంటిలో అయేషా పని చేసేది. జుబేర్ ఆ ఇంటికి వచ్చి వెళుతున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత ప్రేమ వివాహం చేసుకుని మంగళూరులో కాపురం పెట్టారు. జుబేర్‌కు ఆయేషా రెండవ భార్య అని మంగళూరు ఏసీపీ రవి కుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement