బాబు బంగ్లాల హంగుల వ్యయం రూ.100 కోట్లు
- సీఎం కార్యాలయాలు, నివాసాల కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు
- హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో నివాసాలకు హైటెక్ హంగులు
- పేదల కోసం ఒక్క ఇల్లయినా నిర్మించని టీడీపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలి’’ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు స్వీకరించిన రోజు ఇచ్చిన పిలుపు ఇదీ. రెండున్నరేళ్ల పరిస్థితిని గమనిస్తే.. చంద్రబాబు తన సూక్తిని తానే పాటించలేదని తేటతెల్లమవుతోంది. ముఖ్యమంత్రి బంగ్లాల్లో సోకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రెండున్నరేళ్లలో సెంచరీ దాటిపోయింది. ఒక్క కొత్త బంగ్లాను కూడా నిర్మించకపోయినా ఉన్న బంగ్లాలకు మరమ్మతులు, హంగుల పేరుతో ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్టేశారు. హైదరాబాద్ సచివాలయంలోని కార్యాలయాల్లో మరమ్మతులు, ఫర్నిచర్ కోసం రూ.45 కోట్లు వెచ్చించారు.
రెండున్నరేళ్లలో హైదరాబాద్ సచివాలయం, లేక్‌వ్యూ అతిథి గృహానికి రూ.కోట్ల సొమ్ముతో అత్యాధునిక హంగులు కల్పించిన ముఖ్యమంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చేశారు. హైదరాబాద్ సచివాలయంలోని ఎల్ బ్లాకులో రెండు అంతస్తుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం రూ.10 కోట్లు వెచ్చించారు. అంతేకాకుండా మరో రూ.10 కోట్లతో అధునాతన, అత్యంత విలాసవంతమైన డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, ఇతర ఫర్నిచర్‌ను ఎల్ బ్లాకులోని ఏడు, ఎనిమిదో అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ఫర్నిచర్ అలాగే ఉంది. రూ.45 కోట్లతో హంగులద్దిన బంగ్లాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైపోయారు.
డీఏ అడిగితే నిధుల్లేవంటారా?
విజయవాడలోని సాగునీటి శాఖ క్యాంపు కార్యాలయంతోపాటు ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ కోసం రూ.40 కోట్లు వెచ్చించారు. ఇదంతా చాలదన్నట్లు ఢిల్లీలో ముఖ్యమంత్రికి కేటాయించిన జన్‌పథ్-1లో ఇంటి మరమ్మత్తుల కోసం మరో రూ.5.82 కోట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడలో సాగునీటి శాఖకు చెందిన అతిథిగృహంలో సోకుల కోసం ఏకంగా రూ.20 కోట్లు వెచ్చించారు. ఉన్న బంగ్లాలోనే మార్పులు చేర్పులకు భారీగా ప్రజల సొమ్మును ఖర్చు చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లయినా నిర్మించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయాలు, నివాసాల కోసం కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తుండడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. డీఏ అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్న ముఖ్యమంత్రి తాను నివాసం ఉండే భవనాల కోసం ఇబ్బడిముబ్బడిగా వ్యయం చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.