నేడే బక్రీద్ | Bakrid to be celebrated today | Sakshi
Sakshi News home page

నేడే బక్రీద్

Published Mon, Oct 6 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

నేడే బక్రీద్

నేడే బక్రీద్

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోమవారం ఘనంగా జరుపుకునేందుకు రాష్ర్టంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి.

సాక్షి, చెన్నై: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సోమవారం  ఘనంగా జరుపుకునేందుకు రాష్ర్టంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గా మైదానాలు సిద్ధమయ్యాయి. పండుగను పురస్కరించుకుని ముస్లిం లకు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి  ఓ పన్నీరు సెల్వం, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి భావం మిన్నంటే ‘రంజాన్’ అనంతరం  ముస్లింలు జరుపుకునే మరో పండుగ బక్రీద్. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా,ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉంది.
 
 దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రాహీం తన కలను అల్లా ఆదేశంగా భావించి, తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి హజ్రత్ ఇబ్రాహీం సిద్ధం అవుతారు. ఇందుకు ఇస్మాయిల్ సైతం అంగీకరించి బలి దానానికి సిద్ధం అవుతాడు. అయితే, బలి ఇచ్చే సమయంలో వీరి భక్తికిమెచ్చిన అల్లా ఇస్మాయిల్ స్థానంలో ఓ గొర్రెను ఉంచుతారు. నాటి నుంచి వీరి త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు.
 హజ్ యాత్ర:  ఇస్లాం సూచించే ఐదు సూత్రాల్లో హజ్ యాత్ర కూడా ఒకటి. మహ్మద్ ప్రవక్త  సూచనల మేరకు జీవితంలో ఓ సారైనా ప్రతి ముస్లిం హజ్ యాత్ర చేయాల్సి ఉంది. ఈ యాత్ర దుల్హజ్ మాసంగా పిలిచే ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. బక్రీద్ పర్వదినాన మక్కాలో నమాజు చేయడానికి అత్యధికులు ఇష్ట పడతారు. ఈ ప్రార్థన కోసం ఏటా రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల సంఖ్య పెరుగుతూనే ఉంది.  
 
 ఖుర్బానీ: బక్రీద్ పర్వదినాన ప్రార్థనే కాదు...ఖుర్బానీ ఇవ్వడం అత్యంత ముఖ్య ఘట్టం. హజ్రత్ ఇబ్రాహీం త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రతి ఇంటా గొర్రె లేదా ఒంటెను ఖుర్బానీ ఇస్తారు. ఆర్థిక  స్తోమత కల్గిన వారు ఒకటి లేదా రెండు గొర్రెలను ఖుర్బానీ ఇస్తారు. ఆర్థిక స్థోమత  అంతంత మాత్రం ఉండే వాళ్లు ఐదారుగురు కలసి మసీదుల ద్వారా ఖుర్బానీకి ఏర్పాట్లు చేసుకుంటారు. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె లేదా ఒంటె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. ఇందులో ఓ భాగం తమ కుటుంబానికి, రెండో భాగం బంధు మిత్రులకు, మూడో భాగం పేదలకు పంచి పెడతారు. దీంతో గొర్రెల ధరలకు రెక్కలొచ్చాయి. నగరం, శివారుల్లోని  పల్లవరం, తాంబరం సానిటోరియం, ప్యారీస్, వ్యాసార్పాడి తదితర ప్రాంతాల్లోని గొర్రెల సంతల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొందరు అయితే, రాజస్థాన్ నుంచి ముందుగానే ఒంటెలను కొనుగోలు చేసి, ఇక్కడికి తీసుకొచ్చారు.
 
 సందడిగా: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త దుస్తుల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఖుర్బానీకి గొర్రెల్ని సిద్ధం చేశారు. పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తరు, బిర్యాని, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలి వచ్చారు. ముస్లింలు అత్యధికంగా ఉండే చెన్నైలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, తాంబరం, అరుంబాక్కం, అన్నా సాలై, ఎంఎండీఏ, ఆవడి పరిసరాల్లో సందడి నెలకొంది. ఇక, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, రామనాథపురం, వేలూరు, తూత్తుకుడి, విరుదునగర్, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం తదితర పట్టణాల్లో పండుగకు సర్వం సిద్ధం చేశారు.
 
 బక్రీద్ ప్రార్థనలకు రాష్ట్రంలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉదయం 8 గంటలకు, మరికొన్ని చోట్ల 8.30, 9 గంటలకు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో, మసీదుల్లో ఈ ప్రార్థనలు జరగనున్నాయి.  ప్రార్థనల అనంతరం ఖుర్భానికి సర్వం సిద్ధం చేశారు.  నేతల శుభాకాంక్షలు: బక్రీద్  పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ఆదివారం రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య తన ప్రకటనలో ముస్లింలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన త్యాగం, నమ్మకం, ఐక్యత, మత సామరస్యం మరింతగా పెంపొందాలని ఆకాంక్షించారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం పేర్కొంటూ, భక్తి భావంతో ముందుకెళ్తున్న రాష్ట్రంలోని ముస్లింలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని కోరారు.
 
 డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో మహ్మద్ ప్రవక్త అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన  సూక్తులను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్న ముస్లింలలో స్నేహ భావం మరింత పెంపొందాలని కాంక్షించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డీఎండీకే నాయకులు, కార్యకర్తలు పేద ముస్లింలతో కలిసి ఖుర్బానీ ఇచ్చి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పీఎంకే అధినేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియ దేశీయ ముస్లిం లీగ్ నేత జవహర్ అలీ, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, ఐజేకే నేత పారివేందన్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement