న్యూఢిల్లీ : దీపావళి పర్వదిన సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా అమ్మకాలపై సుప్రీం కోర్టు సోమవారం నిషేధం విధించింది. అయితే, తీర్పుపై ఢిల్లీ వాసులు సోషల్‌మీడియా వేదికగా భిన్న స్వరాలు వినిపించారు. కొందరు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్స్ చేస్తే.. మరికొందరు తీర్పును తప్పుబట్టారు. సోన్ పాపిడిపై నిషేధం విధించండి అంతేకానీ, పటాసులపై దేనికీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.
న్యూఢిల్లీలో కాలుష్యం పాళ్లు తగ్గించే దిశగానే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెల 1వ తేదీ వరకూ బాణసంచాను నిల్వ చేయడం గానీ, వినియోగించడం కానీ చేయరాదు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో టాపాసుల అమ్మకంపై నిషేధం విధిస్తూ గత ఏడాది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్షికంగా ఎత్తివేసిన ఈ ఆదేశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఈ నెల 6న రిజర్వులో ఉంచింది.
దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 11న టపాసుల అమ్మకం లైసెన్సులను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. తాజాగా అర్జున్ గోపాల్ అనే వ్యక్తి ఈ ఆదేశాలను పునరుద్ధరించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని, కాబట్టి ఈ ఏడాది దీపావళి నేపథ్యంలో పటాకుల అమ్మకంపై నిషేధాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా మద్దతు తెలిపింది. దీంతో పటాకుల అమ్మకంపై నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.
Comments
Please login to add a commentAdd a comment