బంద్ ప్రశాంతం | Bandh peaceful | Sakshi
Sakshi News home page

బంద్ ప్రశాంతం

Published Thu, Sep 3 2015 3:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:51 PM

బంద్ ప్రశాంతం - Sakshi

బంద్ ప్రశాంతం

సాక్షి, ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. చాలా ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పలుచోట్ల అనుకున్నంత మేరకు సఫలీకృతం కాలేకపోయింది. పలు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎప్పటిలాగే రోడ్డెక్కాయి. షాపులు, ప్రైవేటు కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కేవలం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు మాత్రమే మూత పడ్డాయి.

 రైళ్లు యథాతథం..
 ముంబైలో ట్యాక్సీలు మినహా బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లు యథాతథంగా తిరిగాయి. బ్యాంకులు మూసేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారులు కూడా బ్యాంకు, వ్యాపార లావాదేవీలు నిర్వహించలేకపోయారు. నగరంలో కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొనడం వల్ల కార్యాలయాలు బోసి పోయి కనిపించాయి. రైల్వే, బీఎంసీ ఉద్యోగులు, ఉపాధ్యాయలు కేవలం నైతికంగా మద్దతు ప్రకటించడంతో పాఠశాలలపై ఎలాంటి ప్రభావం కన్పించలేదు. కార్పొరేషన్ ఆస్పత్రి సిబ్బంది బంద్‌లో పాల్గొనక పోవడంతో వైద్య సేవలపై ప్రభావం పడలేదు.

కాగా ఉబర్, ఓలా ప్రైవేటు వాహనాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నితేశ్ రాణే నేతృత్వంలోని స్వాభిమాన్ సంఘటన మంగళవారం చేపట్టిన ట్యాక్సీ సమ్మెతో ముంబైకర్లు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బుధవారం కూడా నగర రహదారులపై ట్యాక్సీలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్వగ్రామాలకు వెళ్లే వారు లగేజీ, పిల్లపాపలతో బస్ స్టాపుల్లో పడిగాపులు పడాల్సి వచ్చింది. అదేవిధంగా దూరప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముంబైలో దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట ట్యాక్సీలు దొరక్క పడిగాపులు కాశారు. ట్యాక్సీలు నడవకపోవడంతో నిత్యం ఖాళీగా తిరిగే బెస్ట్ బస్సులు రోజంతా కిక్కిరిసి కనిపించాయి.

 కార్మిక సంఘాల భారీ ర్యాలీలు..
 శ్రమజీవి సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు బుధవారం పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), అఖిల భారత క్రాంతికారి విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో డోంబీవలి తూర్పులోని లేబర్ నాకా నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ వేలస్కర్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు.

శ్రమజీవి సంఘం అధ్యక్షుడు రమేశ్ గోండ్యాల మాట్లాడుతూ..  మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి, పెట్టుబడిదారులకు నమ్మిన బంటులా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చే శారు. సీపీఎం నాయకుడు వాన్ కండే, సీపీఐ నాయకుడు కాలు కోమస్కార్, అఖిల భారత క్రాంతికారి విద్యార్థి నాయకుడు అక్షయ్ పాటక్ తదితరులు పాల్గొన్నారు.
 
 సమ్మెకు పలుసంఘాల మద్దతు
  కేంద్ర సర్కార్ కార్మికుల చట్టాలను కాలరాసే పద్ధతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కామ్‌గార్ సంఘటన సంయుక్త కృతి సమితి ఆధ్వర్యంలో ఛలో ఆజాద్ మైదాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సఫాయి కార్మికులు, విద్యుత్ కార్మికులు, టెలిఫోన్ రంగంలోని కార్మిక సంఘాలు, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, రెడ్ ఫ్లాగ్ సీఐటీయూ, ఏఐటీయూసీ, ముంబై శిక్షక్ సంస్థ, గిర్ని కామ్‌గార్ సంఘటన, టీయూసీఐ, ఇతర సంఘాలతోపాటు ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ సంఘీభావ వేదిక, శ్రమజీవి సంఘాలు దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు.

ఎన్‌టీయూఐ అధ్యక్షుడు ఎన్.వాసుదేవ్, మిలింద్ రణడే, వివేకా మంటోరే, గోలంధాస్, ప్రకాశ్‌రెడ్డి, ప్రకాశ్ అంబేడ్కర్, ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గుండె శంకర్, పొట్ట వెంకటేశ్, కర్రెం సత్యనారాయణ, మారంపెల్లి రవి, సింగపంగ సైదులు, సంఘీభావ వేదిక నుంచి మచ్చ ప్రభాకర్, అక్కెనపెల్లి దుర్గేశ్, గోండ్యాల రమేశ్ సమ్మెలో పాల్గొన్నారు.
 
 దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బ్యాంకులు, వివిధ కా ర్యాలయాలు మూతపడటంతో వినియోగదారులు ఇబ్బందికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement