Labor law
-
ప్రసూతి చట్ట సవరణలకు కేబినెట్ ఓకే
♦ కార్మిక చట్టం, లోక్‌పాల్ చట్టాల్లో సవరణలకు కూడా ఓకే ♦ ఎఫ్‌సీఐ కార్మికులకు కొత్త పెన్షన్ పథకం, వైద్య సేవలు ♦ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు వాడకం తగ్గింపునకు 1,554 కోట్ల ప్రాజెక్టు న్యూఢిల్లీ: మహిళలకు ప్రసూతి సెలవులను ప్రస్తుతమున్న 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి ప్రయోజనాల చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రసూతి ప్రయోజనం (సవరణ) బిల్లు, 2016ను లోక్‌సభలో ప్రవేశపెట్టటం ద్వారా 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టానికి చేసిన సవరణలను.. ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. దీనిద్వారా మహిళలకు మాతృత్వ కాలంలో ఉద్యోగ భద్రత లభిస్తుంది. తమ శిశువుల పరిరక్షణ కోసం పూర్తి వేతనంపై సెలవు తీసుకునే అవకాశం లభిస్తుంది. పది మంది అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు గల అన్ని సంస్థలకూ ఈ చట్టం వర్తిస్తుంది. సంఘటిత రంగంలో గల 18 లక్షల మంది మహిళా ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. బిల్లును రాజ్యసభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది. ‘లోక్‌పాల్’లో మార్పులకు ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోల ఎగ్జిక్యూటివ్‌లు తమ జీవితభాగస్వాములు, పిల్లల ఆస్తుల వివరాలను వెల్లడించకుండా మినహాయిస్తూ లోక్‌పాల్ చట్టానికి చేసిన సవరణను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ సంస్థ అయిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఉద్యోగులు 35,000 మందికి కొత్త పెన్షన్ పథకాన్ని, పదవీ విరమణ తర్వాత వైద్య సేవలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,554 కోట్లతో ఏయూఎస్‌సీ ప్రాజెక్టు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఏయూఎస్‌సీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రూ. 1,554 కోట్ల వ్యయంతో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఇంధన భద్రత లభించనుంది. భవిష్యత్తు థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు వినియోగం, కర్బన ఉద్గారాలను తగ్గించటం లక్ష్యంగా ప్రాజెక్టును బీహెచ్ఈఎల్, ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చ్, ఎన్టీపీసీ)ల కన్సార్షియం ప్రతిపాదించింది. -
బంద్ ప్రశాంతం
సాక్షి, ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. చాలా ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పలుచోట్ల అనుకున్నంత మేరకు సఫలీకృతం కాలేకపోయింది. పలు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎప్పటిలాగే రోడ్డెక్కాయి. షాపులు, ప్రైవేటు కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కేవలం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు మాత్రమే మూత పడ్డాయి. రైళ్లు యథాతథం.. ముంబైలో ట్యాక్సీలు మినహా బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లు యథాతథంగా తిరిగాయి. బ్యాంకులు మూసేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారులు కూడా బ్యాంకు, వ్యాపార లావాదేవీలు నిర్వహించలేకపోయారు. నగరంలో కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొనడం వల్ల కార్యాలయాలు బోసి పోయి కనిపించాయి. రైల్వే, బీఎంసీ ఉద్యోగులు, ఉపాధ్యాయలు కేవలం నైతికంగా మద్దతు ప్రకటించడంతో పాఠశాలలపై ఎలాంటి ప్రభావం కన్పించలేదు. కార్పొరేషన్ ఆస్పత్రి సిబ్బంది బంద్‌లో పాల్గొనక పోవడంతో వైద్య సేవలపై ప్రభావం పడలేదు. కాగా ఉబర్, ఓలా ప్రైవేటు వాహనాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నితేశ్ రాణే నేతృత్వంలోని స్వాభిమాన్ సంఘటన మంగళవారం చేపట్టిన ట్యాక్సీ సమ్మెతో ముంబైకర్లు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బుధవారం కూడా నగర రహదారులపై ట్యాక్సీలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్వగ్రామాలకు వెళ్లే వారు లగేజీ, పిల్లపాపలతో బస్ స్టాపుల్లో పడిగాపులు పడాల్సి వచ్చింది. అదేవిధంగా దూరప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముంబైలో దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట ట్యాక్సీలు దొరక్క పడిగాపులు కాశారు. ట్యాక్సీలు నడవకపోవడంతో నిత్యం ఖాళీగా తిరిగే బెస్ట్ బస్సులు రోజంతా కిక్కిరిసి కనిపించాయి. కార్మిక సంఘాల భారీ ర్యాలీలు.. శ్రమజీవి సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు బుధవారం పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), అఖిల భారత క్రాంతికారి విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో డోంబీవలి తూర్పులోని లేబర్ నాకా నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ వేలస్కర్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. శ్రమజీవి సంఘం అధ్యక్షుడు రమేశ్ గోండ్యాల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి, పెట్టుబడిదారులకు నమ్మిన బంటులా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చే శారు. సీపీఎం నాయకుడు వాన్ కండే, సీపీఐ నాయకుడు కాలు కోమస్కార్, అఖిల భారత క్రాంతికారి విద్యార్థి నాయకుడు అక్షయ్ పాటక్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు పలుసంఘాల మద్దతు కేంద్ర సర్కార్ కార్మికుల చట్టాలను కాలరాసే పద్ధతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కామ్‌గార్ సంఘటన సంయుక్త కృతి సమితి ఆధ్వర్యంలో ఛలో ఆజాద్ మైదాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సఫాయి కార్మికులు, విద్యుత్ కార్మికులు, టెలిఫోన్ రంగంలోని కార్మిక సంఘాలు, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, రెడ్ ఫ్లాగ్ సీఐటీయూ, ఏఐటీయూసీ, ముంబై శిక్షక్ సంస్థ, గిర్ని కామ్‌గార్ సంఘటన, టీయూసీఐ, ఇతర సంఘాలతోపాటు ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ సంఘీభావ వేదిక, శ్రమజీవి సంఘాలు దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ఎన్టీయూఐ అధ్యక్షుడు ఎన్.వాసుదేవ్, మిలింద్ రణడే, వివేకా మంటోరే, గోలంధాస్, ప్రకాశ్‌రెడ్డి, ప్రకాశ్ అంబేడ్కర్, ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గుండె శంకర్, పొట్ట వెంకటేశ్, కర్రెం సత్యనారాయణ, మారంపెల్లి రవి, సింగపంగ సైదులు, సంఘీభావ వేదిక నుంచి మచ్చ ప్రభాకర్, అక్కెనపెల్లి దుర్గేశ్, గోండ్యాల రమేశ్ సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బ్యాంకులు, వివిధ కా ర్యాలయాలు మూతపడటంతో వినియోగదారులు ఇబ్బందికి గురయ్యారు. -
రైల్వే, కార్మిక చట్టాలకు సవరణలు
లోక్‌సభలో బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే కార్మిక చట్టాలను సవరించేందుకు ఉద్దేశించిన రెండు వివాదాస్పద బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అదనపు పనివేళల(ఓవర్ టైమ్) పరిమితి పెంపు, నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ శిక్షణ, రాత్రి షిఫ్టుల్లో మహిళలకున్న పలు సడలింపుల ఎత్తివేత తదితర అంశాలకు సంబంధించి ‘ద ఫ్యాక్టరీస్(సవరణ) బిల్లు, 2014’తోపాటు ‘అప్రెంటిసెస్ (సవరణ) బిల్లు, 2014’ను కేంద్ర కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టారు. వీటిని గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించే వరకూ ప్రవేశపెట్టొద్దని కాంగ్రెస్ ఎంపీలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై తర్వాత పూర్థి స్థాయిలో చర్చించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
పొట్టగొడుతున్న నతాఖా!
సౌదీ అరేబియాలో కొత్త చట్టంతో బిక్కుబిక్కుమంటున్న వేలాది మంది రాష్ట్ర కార్మికులు సాక్షి, సిటీబ్యూరో: సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ రాష్ట్రవాసుల్లో గుబులు రేపుతోంది. పొట్టచేతబట్టుకొని దూర దేశాలకు వెళ్లిన కార్మికుల్లో కల్లోలం పుట్టిస్తోంది. ఈ చట్టం కారణంగా సౌదీ అరేబియా నుంచి వేలాది మంది రాష్ట్ర కార్మికులు తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నతాఖా గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తుండడంతో అక్కడి కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. స్వదేశానికి వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ఉపాధికి ముప్పు ఏర్పడి సుమారు 10 వేల మంది వరకు పండుగ, సెలవుల పేరుతో స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మరో 40 వేల మంది వరకు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో సుమారు 16 వేల మందికి పైగా కార్మికులు ‘ఎగ్జిట్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకొని సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ వద్ద ఎదురు చూస్తున్నారు. మరికొందరు చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లిపోతున్నారు. అప్పోసొప్పో చేసి టికెట్ కోసం డబ్బులు సమకూర్చుకుంటున్నా, ఔట్ పాస్ దొరికినా, ఎగ్జిట్ పర్మిట్లు లభించక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గడువు ముగిస్తే జైలు తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పాస్‌పోర్టు లేని వారిని గుర్తించి అదుపులో తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సౌదీలో 6 లక్షల మంది రాష్ట్రవాసులు.. గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద దేశమైన సౌదీ అరేబియాలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తెలుగువారు అధిక సంఖ్యలో సౌదీకి ఉపాధి కోసం వెళ్లారు. చాలామంది కంపెనీ వీసాలు దొరక్క విజిటింగ్ వీసాలపై వెళ్లి గడువు పూర్తయినా అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వ అంచనా ప్రకారం మనరాష్ట్రం నుంచి సుమారు 6 లక్షల మంది సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుస్తోంది. నతాఖా కారణంగా ఇందులో సుమారు లక్ష మంది వరకు ఇంటిదారి పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకు ఈ చట్టం తెచ్చారు..? తమ దేశ కంపెనీల్లో పది శాతం మేరకు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ సౌదీ ప్రభుత్వం నతాఖా చట్టాన్ని తీసుకువచ్చింది. మొదటగా మార్చి 2న సౌదీ అరేబియా కార్మిక శాఖ మంత్రి ఆదిల్ ఫకీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం సౌదీ ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యాపార సంస్థలు తమ కంపెనీల్లో స్థానికులకు పది శాతం ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలి. లేకుంటే లెసైన్సులు రద్దు చేస్తారు. వాస్తవానికి సౌదీలోని చాలా కంపెనీల్లో విదేశీయులు 95 శాతానికి మించి పని చేస్తున్నారు. జూలై 3లోగా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, దీన్ని ఉల్లంఘించినవారికి జరిమానా, పనికి కుదిరిన వారికి జీవితకాల జైలు శిక్ష తప్పదని సౌదీ సర్కారు హెచ్చరించింది. అయితే అ తర్వాత సౌదీ రాజు అమీర్ అబ్దుల్లా నతాఖా గడువును నాలుగు నెలలు పొడగించారు. నవంబర్ 3తో ఆ గడువు ముగియనుండడంతో రాష్ట్రానికి చెందిన కార్మికుల్లో కలవరం మొదలైంది. కఫిల్ చేతుల్లోనే పాస్‌పోర్టులు.. కంపెనీ వీసా కాకుండా స్వతంత్ర వీసాపై వెళ్లిన కార్మికుల పాస్‌పోర్టులు కఫిల్ చేతిలో చిక్కుకొపోయాయి. సౌదీలోని ప్రతి వ్యక్తికి తమ ఇంటి అవసరాల కోసం మూడు వీసాలను ఇచ్చే అధికారం ఉంటుంది. వీటిని ‘ఆజాద్ వీసా’ అంటారు. ఈ వీసాపై సౌదీకి వెళ్లినవారు కఫిల్ (వీసా ఇచ్చిన సౌదీ వ్యక్తి) నుంచి అఖామా (పని కోసం అనుమతి) తీసుకుంటారు. అనంతరం వారు సౌదీలో ఎక్కడైనా పని చేయొచ్చు. అయితే ఏటేటా దీన్ని రెన్యూవల్ చేయించుకోవాలి. అఖామా ఇచ్చిన వ్యక్తి వీరి పాస్‌పోర్టును తన వద్దే ఉంచుకుంటాడు. అఖామా ఇచ్చినందుకు కఫాలత్ పేరిట ఏటా 3,000 నుంచి 5,000 రియాళు ్ల(సుమారు రూ.40 వేలు) కఫిల్ వసూలు చేస్తాడు. ఎక్కువ శాతం వీసాలు డ్రైవర్లు, సర్వెంట్, గార్డెనర్, టైలర్స్, ప్లంబర్స్ తదితర కిందిస్థాయి ఉద్యోగాలకే ఇస్తారు. ఈ వీసాలు తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్లిన వారు తమ అర్హతను బట్టి వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. ఇలా స్థిరపడినవారంతా నతాఖా చట్టంతో తిప్పలు పడుతున్నారు. నతాఖా చట్టం ఏం చెబుతోందంటే.. ‘నతాఖా’ చట్టం ప్రకారం సౌదీకి వెళ్లిన వ్యక్తి తప్పనిసరిగా తనకు వీసా ఇచ్చిన స్థానికుడి వద్దే, ఏ పనికి అనుమతి లభించిందో ఆ పనినే చేయాలి. వేరేచోట పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. సౌదీకి ఉపాధి కోసం వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు. అక్కడి ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఔట్ పాస్ లభిస్తున్నా... చేతిలో చిల్లి గవ్వలేక తిరిగి రాలేక వేలాది మంది కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. -కె.నర్సింహ్మనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి ఉద్యోగం పోతుందేమోనని భయమేస్తోంది.. నా భర్త గత 15 ఏళ్ల నుంచి మక్కా శివారు ప్రాంతంలో ఎక్స్‌లేటర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ కొత్త చట్టం వల్ల ఆయన ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసివేస్తారో అన్న భయంతో ఉన్నాం. మా అమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఈ పరిస్థితులు రావటం చాలా బాధ కలిగిస్తున్నాయి. - సాలెహా బేగం, జగిత్యాల, కరీంనగర్ జిల్లా ఇప్పుడు నా బతుకేంటీ? నేను బిల్డింగ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాను. గతంలో సౌదీకెళ్లినా సరైన పని దొరక్క తిరిగి వచ్చేశాను. పిల్లలు పెద్దవారవుతుండడంతో హైదరాబాద్‌లో డబ్బులు సరిపోక ఇంటిని తనఖా పెట్టి 8 నెలల క్రితం మళ్లీ సౌదీ వచ్చాను. ఇంకా ఇక్కడ పని దొరకలేదు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. తిరిగి వచ్చేద్దామంటే చేతిలో డబ్బుల్లేవు. నా బతుకేంటో అర్థం కావట్లేదు. - అబ్దుల్ బాసిత్ జిద్దా, సౌదీ ప్రభుత్వమే ఆదుకోవాలి మా నాన్న గారు గత 30 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో వ్యాపారం చేస్తున్నారు. ఆ సంస్థల్లో సుమారు 50 మంది హైదరాబాద్‌కు చెందిన వారు పని చేస్తుంటారు. ఈ కొత్త చట్టం ద్వారా మా వ్యాపారం కొనసాగుతుందా లేదా అన్న భయాందోళనలు ఉన్నాయి. సంస్థలో పని చేస్తున్న 50 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏమౌతుందా అన్న ఆందోళన ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ చట్టం వల్ల నిరాశ్రయులవుతున్న వారిని ఆదుకోవాలి. - ముహ్మద్ మొయినుద్దీన్, హైదరాబాద్