పొట్టగొడుతున్న నతాఖా! | Hit by Nitaqat, Indians in Saudi Arabia regularising stay | Sakshi
Sakshi News home page

పొట్టగొడుతున్న నతాఖా!

Published Sat, Nov 2 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

పొట్టగొడుతున్న నతాఖా!

పొట్టగొడుతున్న నతాఖా!

సౌదీ అరేబియాలో కొత్త చట్టంతో బిక్కుబిక్కుమంటున్న వేలాది మంది రాష్ట్ర కార్మికులు
సాక్షి, సిటీబ్యూరో: సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టం ‘నతాఖా’ రాష్ట్రవాసుల్లో గుబులు రేపుతోంది. పొట్టచేతబట్టుకొని దూర దేశాలకు వెళ్లిన కార్మికుల్లో కల్లోలం పుట్టిస్తోంది. ఈ చట్టం కారణంగా సౌదీ అరేబియా నుంచి వేలాది మంది రాష్ట్ర కార్మికులు తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నతాఖా గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తుండడంతో అక్కడి కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. స్వదేశానికి వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
 
ఇప్పటికే ఉపాధికి ముప్పు ఏర్పడి సుమారు 10 వేల మంది వరకు పండుగ, సెలవుల పేరుతో స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మరో 40 వేల మంది వరకు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో సుమారు 16 వేల మందికి పైగా కార్మికులు ‘ఎగ్జిట్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకొని సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ వద్ద ఎదురు చూస్తున్నారు. మరికొందరు చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లిపోతున్నారు. అప్పోసొప్పో చేసి టికెట్ కోసం డబ్బులు సమకూర్చుకుంటున్నా, ఔట్ పాస్ దొరికినా, ఎగ్జిట్ పర్మిట్లు లభించక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గడువు ముగిస్తే జైలు తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పాస్‌పోర్టు లేని వారిని గుర్తించి అదుపులో తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
 
సౌదీలో 6 లక్షల మంది రాష్ట్రవాసులు..
గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద దేశమైన సౌదీ అరేబియాలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తెలుగువారు అధిక సంఖ్యలో సౌదీకి ఉపాధి కోసం వెళ్లారు.  చాలామంది కంపెనీ వీసాలు దొరక్క విజిటింగ్ వీసాలపై వెళ్లి గడువు పూర్తయినా అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వ అంచనా ప్రకారం మనరాష్ట్రం నుంచి సుమారు 6 లక్షల మంది సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుస్తోంది. నతాఖా కారణంగా ఇందులో సుమారు లక్ష మంది వరకు ఇంటిదారి పట్టాల్సిన దుస్థితి నెలకొంది.
 
ఎందుకు ఈ చట్టం తెచ్చారు..?
తమ దేశ కంపెనీల్లో పది శాతం మేరకు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ సౌదీ ప్రభుత్వం నతాఖా చట్టాన్ని తీసుకువచ్చింది. మొదటగా మార్చి 2న సౌదీ అరేబియా కార్మిక శాఖ మంత్రి ఆదిల్ ఫకీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం సౌదీ ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యాపార సంస్థలు తమ కంపెనీల్లో స్థానికులకు పది శాతం ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలి. లేకుంటే లెసైన్సులు రద్దు చేస్తారు. వాస్తవానికి సౌదీలోని చాలా కంపెనీల్లో విదేశీయులు 95 శాతానికి మించి పని చేస్తున్నారు. జూలై 3లోగా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, దీన్ని ఉల్లంఘించినవారికి జరిమానా, పనికి కుదిరిన వారికి జీవితకాల జైలు శిక్ష తప్పదని సౌదీ సర్కారు హెచ్చరించింది. అయితే అ తర్వాత సౌదీ రాజు అమీర్ అబ్దుల్లా నతాఖా గడువును నాలుగు నెలలు పొడగించారు. నవంబర్ 3తో ఆ గడువు ముగియనుండడంతో రాష్ట్రానికి చెందిన కార్మికుల్లో కలవరం మొదలైంది.
 
కఫిల్ చేతుల్లోనే పాస్‌పోర్టులు..
కంపెనీ వీసా కాకుండా స్వతంత్ర వీసాపై వెళ్లిన కార్మికుల పాస్‌పోర్టులు కఫిల్ చేతిలో చిక్కుకొపోయాయి. సౌదీలోని ప్రతి వ్యక్తికి తమ ఇంటి అవసరాల కోసం మూడు వీసాలను ఇచ్చే అధికారం ఉంటుంది. వీటిని ‘ఆజాద్ వీసా’ అంటారు. ఈ వీసాపై సౌదీకి వెళ్లినవారు కఫిల్ (వీసా ఇచ్చిన సౌదీ వ్యక్తి) నుంచి అఖామా (పని కోసం అనుమతి) తీసుకుంటారు. అనంతరం వారు సౌదీలో ఎక్కడైనా పని చేయొచ్చు. అయితే ఏటేటా దీన్ని రెన్యూవల్ చేయించుకోవాలి. అఖామా ఇచ్చిన వ్యక్తి వీరి పాస్‌పోర్టును తన వద్దే ఉంచుకుంటాడు. అఖామా ఇచ్చినందుకు కఫాలత్ పేరిట ఏటా 3,000 నుంచి 5,000 రియాళు ్ల(సుమారు రూ.40 వేలు) కఫిల్ వసూలు చేస్తాడు. ఎక్కువ శాతం వీసాలు డ్రైవర్లు, సర్వెంట్, గార్డెనర్, టైలర్స్, ప్లంబర్స్ తదితర కిందిస్థాయి ఉద్యోగాలకే ఇస్తారు. ఈ వీసాలు తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్లిన వారు తమ అర్హతను బట్టి వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. ఇలా స్థిరపడినవారంతా నతాఖా చట్టంతో తిప్పలు పడుతున్నారు.
 
 నతాఖా చట్టం ఏం చెబుతోందంటే..
 ‘నతాఖా’ చట్టం ప్రకారం సౌదీకి వెళ్లిన వ్యక్తి తప్పనిసరిగా తనకు  వీసా ఇచ్చిన స్థానికుడి వద్దే, ఏ పనికి అనుమతి లభించిందో ఆ పనినే చేయాలి. వేరేచోట పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు.
 
 ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
 సౌదీకి ఉపాధి కోసం వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు. అక్కడి ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఔట్ పాస్ లభిస్తున్నా... చేతిలో చిల్లి గవ్వలేక తిరిగి రాలేక  వేలాది మంది కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వారిని ఆదుకోవాలి.
 -కె.నర్సింహ్మనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి
 
 ఉద్యోగం పోతుందేమోనని భయమేస్తోంది..
 నా భర్త గత 15 ఏళ్ల నుంచి మక్కా శివారు ప్రాంతంలో ఎక్స్‌లేటర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ కొత్త చట్టం వల్ల ఆయన ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసివేస్తారో అన్న భయంతో ఉన్నాం. మా అమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఈ పరిస్థితులు రావటం చాలా బాధ కలిగిస్తున్నాయి.  
 - సాలెహా బేగం, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
 
 ఇప్పుడు నా బతుకేంటీ?
 నేను బిల్డింగ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాను. గతంలో సౌదీకెళ్లినా సరైన పని దొరక్క తిరిగి వచ్చేశాను. పిల్లలు పెద్దవారవుతుండడంతో హైదరాబాద్‌లో డబ్బులు సరిపోక ఇంటిని తనఖా పెట్టి 8 నెలల క్రితం మళ్లీ సౌదీ వచ్చాను. ఇంకా ఇక్కడ పని దొరకలేదు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. తిరిగి వచ్చేద్దామంటే చేతిలో డబ్బుల్లేవు. నా బతుకేంటో అర్థం కావట్లేదు.
 - అబ్దుల్ బాసిత్ జిద్దా, సౌదీ

 ప్రభుత్వమే ఆదుకోవాలి
 మా నాన్న గారు గత 30 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో వ్యాపారం చేస్తున్నారు. ఆ సంస్థల్లో సుమారు 50 మంది హైదరాబాద్‌కు చెందిన వారు పని చేస్తుంటారు. ఈ కొత్త చట్టం ద్వారా మా వ్యాపారం కొనసాగుతుందా లేదా అన్న భయాందోళనలు ఉన్నాయి. సంస్థలో పని చేస్తున్న 50 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏమౌతుందా అన్న ఆందోళన ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ చట్టం వల్ల నిరాశ్రయులవుతున్న వారిని ఆదుకోవాలి.     
- ముహ్మద్ మొయినుద్దీన్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement