
నిఘా నీడన బెంగళూరు
పోలీసుల అదుపులో ఉన్న ఉగ్ర వాది యాసిన్ భత్కల్‌ను విడిపించుకుని పోవడానికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థ భారీ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంతో పాటు నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ :
పోలీసుల అదుపులో ఉన్న ఉగ్ర వాది యాసిన్ భత్కల్‌ను విడిపించుకుని పోవడానికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థ భారీ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంతో పాటు నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హైజాక్ చేసి యాసిన్ భత్కల్‌ను విడిపించుకోవాలనేది ముజాహిద్దీన్ లక్ష్యం. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో నాకాబందీ, సోదాలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్, కంటోన్మెంట్, యశ్వంత్‌పు, యలహంక రైల్వేస్టేషన్లలో ప్రయాణికులతో పాటు వారి లగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా మెజస్టిక్, కెంపేగౌడ బస్‌స్టేషన్, సిటీ మార్కెట్, శివాజీనగర, శాంతినగర, యశవంతపుర, జయనగర నాలుగవ బ్లాక్, బనశంకరి తదితర బస్టాప్‌ల వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్లతో ప్రయాణికులను సోదాలు చేస్తున్నారు.
అదే విధంగా విధాన సౌధ, వికాస సౌధ, రాజ్‌భవన్, హైకోర్టు, యుటిలిటి బిల్డింగ్‌తో న గరంలోని ప్రభుత్వ, అన్ని ప్రైవేటు భవనాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వీడియో కవరేజీ కూడా చేస్తున్నారు. భద్రత ఏర్పాట్లపై సీఎం సిద్దరామయ్య, డీజీపీ లాల్‌రుకుం పచావో, నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌లు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.