ఎనీ టైమ్ ముప్పే!
Published Fri, Nov 22 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
న్యూఢిల్లీ:చాలా ఏటీఎంల వద్ద కనీస భద్రత కూడా కనిపించకపోవడంపై నగర పోలీసుశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఏటీఎంల డోర్ వద్ద కార్డును స్వైప్ చేశాకే లోనికి వెళ్లే పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాయి. దురదృష్టవశాత్తూ చాలా ఏటీఎంలలో ఈ విధానం పనిచేయడం లేదు. అత్యవసర సమయాల్లో సాయం కోసం ఉపయోగపడే ప్యానిక్ బటన్ లేదా హెచ్చరిక వ్యవస్థలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏటీఎం గార్డుల దగ్గర లాఠీ మినహా మరే ఇతర ఆయుధమూ కనిపించదు. వీరిలో చాలా మందికి తుపాకీ లెసైన్సు ఉండకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తమలో చాలా మంది దగ్గర లాఠీలు కూడా లేవని కొందరు గార్డులు చెప్పారు. ఏటీఎంల పరిసరాల శుభ్రతపైనా బ్యాంకులు దృష్టి సారించడం లేదు. ఐటీఓ వంటి కీలక ప్రాంతాల్లోని ఏటీఎంల చుట్టూ పిచ్చిమొక్కలు కనిపిస్తాయి. లోపల చెత్తాచెదారం సర్వసాధారణం. మరో సంగతేమంటే కొన్ని ఏటీఎంల వద్ద అసలు గార్డులే కనిపించడం లేదు.
అలాంటి చోట్ల డబ్బులు తీయాలంటే భయమేస్తోందని ప్రజలు అంటున్నారు. ఏటీఎంలో డబ్బులు పెట్టే సమయంలో మాత్రమే సాయుధ భద్రత ఉంటుందని, మిగతా సమయాల్లో ఎవరూ పట్టించుకోవడం లేదని డిఫెన్స్ కాలనీ వాసులు కొందరు అన్నారు. తమ ప్రాంతంలోని చాలా ఏటీఎంల వద్ద గార్డులు ఉండడం లేదని తెలిపారు. గుడ్డిలో మెల్లలా ప్రతి ఏటీఎం వద్ద సీసీటీవీ కెమెరాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే నేరం చేయాలనుకునే వాళ్లకు కెమెరాలు ఎలాంటి అడ్డంకీ కాదని భద్రతారంగ నిపుణుడు ఒకరు చెప్పారు. అసలు ఆ కెమెరాల్లో ఎన్ని పనిచేస్తున్నాయి.. ఫొటోలు, వీడియో నాణ్యత ఏ మేరకు బాగుందో కూడా తెలియదని పేర్కొన్నారు. నిజానికి ఏటీఎంల నిర్వహణతో బ్యాంకులకు పెద్దగా సంబంధం ఉండదన్నారు. భద్రత లేని ఏటీఎంలను స్థానిక పోలీసులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. బెంగళూరు ఏటీఎంలో ఒక మహిళపై దాడి నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.
ఆర్‌బీఐకి లేఖ
ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు భారత రిజర్వుబ్యాంకు (ఏటీఎం) ప్రధాన భద్రతాధికారికి బుధవారం లేఖ రాశారు. అంతేగాక ఢిల్లీవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల వద్ద భద్రత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారిక వ్యక్తులు మాత్రమే ఏటీఎం షట్టర్లు మూయగలిగేలా ‘సెల్ఫ్‌లాకింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు అధికారులు ఈ సమావేశంలో సూచించారు. బెంగళూరు ఘటనలో ఏటీఎం షట్టర్లు మూసేసి దుండగుడు మహిళపై దాడి చేయడంతో ఆమె సాయం కోసం అభ్యర్థించలేకపోయింది. భద్రతా నియమాలు పూర్తిగా అమలయ్యేలా చూసేందుకు ప్రతి బ్యాంకులో ఒకరిని నియమించే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం ఏటీఎంలలో ఒకే సీసీ కెమెరా ఉంటోందని, నలువైపులా కెమెరాలూ బిగిస్తే అందరినీ గుర్తించడం తేలికవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. కొందరు నేరస్తులు ఏటీఎం కెమెరాకు చిక్కకుండా నేరాలు చేసి పరారవుతున్నారని తెలిపారు.
Advertisement
Advertisement