సాక్షి, ముంబై: శాంతాకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్)పై నుంచి మూడు బెస్టు బస్సులను ప్రారంభించాలని ‘బృహన్‌ముంబై ఎలక్ట్రిక్, సప్లయ్, ట్రాన్స్‌పోర్ట్’ (బెస్టు) నిర్ణయించింది. వీటిని జూన్ ఒకటవ తేదీ నుంచి నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అణుశక్తినగర్ - పశ్చిమ గోరేగావ్‌ల మధ్య నడిచే 374 నెంబర్ బస్సు, భాంద్రా-కుర్లా టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్ నుంచి ఠాణే కాడబరీ జంక్షన్ల మధ్య నడిచే ఎఎస్ 5 నెంబర్ బస్సును ఎస్‌సీఎల్‌ఆర్‌పై నుంచి నడపనున్నారు. అదే విధంగా కొత్తగా ప్రారంభించాలనుకున్న పశ్చిమ భాంద్రా బస్సు డిపో నుంచి వాశి రైల్వేస్టేషన్ల మధ్య నడిచే సి-55 నెంబర్ బస్సును కూడా ఎస్‌సీఎల్‌ఆర్‌పై నుంచి నడపాలని బెస్టు నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం మీదుగా బెస్టు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ టిక్కెట్ చార్జీతోపాటు చాలా తక్కువ సమయంలో తమ గమ్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.
ఎన్నికల నియమావళి కారణంగా ఎలాంటి సందడి లేకుండా శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్)ను ఇటీవలే ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా ప్రయాణించడం ద్వారా ప్రయాణికులకు సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. సొంత వాహనాలలో వెళ్లేవారికి చాలా తక్కువ ఇంధనంతో తొందరగా చేరుకుంటుండగా మరోవైపు అటో, ట్యాక్సీలలో వెళ్లేవారికి ప్రయాణ చార్జీలు కూడా చాలా తగ్గాయి. ఈ మార్గం మీదుగా అటో, టాక్సీలలో వెళ్లే ప్రయాణికులకు సుమారు రూ.50 నుంచి రూ 60 వరకు డబ్బులు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ఎస్‌సీఎల్‌ఆర్ ప్రారంభానికి ముందు ములుండ్ నుంచి వకోలాకు సైన్ మీదుగా వెళ్లాలంటే సుమారు 23 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కాని ఎస్‌సీఎల్‌ఆర్ ప్రారంభం కావడంతో సుమారు అయిదు నుంచి ఆరు కిలోమీటర్లకుపైగా దూరం తగ్గిందని చెప్పవచ్చు. ఈ మార్గం వల్ల ట్రాఫిక్ సమస్యకు కూడా కొంత మేర ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో బెస్టు బస్సులు కూడా ప్రారంభమైనట్టయితే సామన్య ప్రజలు తమ గమ్యస్థానాలకు తక్కువ చార్జీలతో చేరుకునేందుకు వీలుపడనుంది.
ఎస్‌సీఎల్‌ఆర్ మీదుగా బెస్ట్ సేవలు
Published Wed, Apr 30 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement
Advertisement