పెరంబూరు : విశ్రాంతి కళాకారులకు విషం ఇచ్చి చంపేయండి అని అంటున్నారని దర్శక, నటుడు కె.భాగ్యరాజ్ అన్నారు. గత ఏడాది జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన నటుడు విశాల్ వర్గం , కె.భాగ్యరాజ్ అధ్యక్షతన నిర్మాత ఐసరిగణేశ్ వర్గం పోటీ పడ్డారు. అయితే ఆ ఎన్నికలను రద్దు చేయాలంటూ కొందరు సభ్యులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు చెల్లవని, మరో మూడు నెలల్లో మళ్లీ నడిగర్ సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పుపై నటుడు విశాల్ వర్గం మద్రాసు హైకోర్టులోనే రిట్ పిటిషన్ వేశారు.
అందులో ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సంఘానికి ఆర్థికస్తోమత లేదని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 10న తీర్పును ప్రకటిస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న గత ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది. కోర్టు స్టే విధించడాన్ని విశాల్ వర్గం స్వాగతించగా, భాగ్యరాజ్ వర్గం కోర్టు తీర్పునకు కట్టుబడతామని చెప్పారు.కాగా భాగ్యరాజ్ వర్గం బుధవారం స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (స్వచ్ఛ రాజకీయాలు కావాలన్నప్పుడు వస్తా!)
దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మాట్లాడుతూ... సంఘం ఎన్నికల వ్యవహారంలో ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. కాగా సంఘం ద్వారా పెన్షన్లను పొందుతున్న విశ్రాంతి సభ్యులకు 6 నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు పేదరికం కారణంగా తమను విషం ఇచ్చి చంపేయండి అని అనడం బాధ అనిపించిందన్నారు. అనంతరం నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ మద్రాసు హైకోర్టు తీర్పును శిరసావహిస్తామన్నారు. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం తీర్పుపై నటుడు విశాల్ రిట్ పిటిషన్ వేయడం సరి కాదన్నారు.
అయితే తాము మాత్రం మళ్లీ కోర్టులో అప్పీల్‌కు వెళ్లమని చెప్పారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా, ఇంతకు ముందు జరిగిన పోలింగ్ ఓట్లను లెక్కించినా తమకు సమ్మతమేనన్నారు. కాగా ఆరు నెలలుగా పింఛన్లు అందక విశ్రాంతి సంఘ సభ్యులు బాధపడుతున్నారన్నారు. అలాంటి వారికి తామే పింఛన్లు అందించాలని భావించామని అందులో భాగంగా ప్రస్తుతం సంఘం బాధ్యతల నిర్వహిస్తున్న ప్రభుత్వం నియమించిన అధికారిని కలిశారు. ఆయన్ని పెన్షన్లు పొందుతున్న విశ్రాంతి సభ్యుల పట్టికను ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు)
అయితే ఆయన తాను నడిగర్ సంఘంకు మాత్రమే అధికారిగా నియమించబడ్డానని, పింఛన్లు పొందుతున్న వారి పట్టిక సంఘం ట్రస్ట్ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి వద్ద ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. కాబట్టి విశాల్ వర్గాన్ని పింఛన్లు పొందుతున్న విశ్రాంతి కళాకారుల పట్టికను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు, అదే విధంగా ఎవరైతే పింఛన్లకు అర్హులో వారంతా తమ గుర్తింపు కార్డులతో తమను కలిస్తే పింఛన్లు అందిస్తామని ఐసరి గణేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment