విశాల్‌కు గట్టి ఎదురుదెబ్బ | Big Shock To Actor Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌కు గట్టి ఎదురుదెబ్బ

Published Sun, Apr 28 2019 4:08 PM | Last Updated on Sun, Apr 28 2019 4:08 PM

Big Shock To Actor Vishal - Sakshi

విశాల్‌

తమిళ సినిమా: నిర్మాతల మండలి అధ్యక్షుడు, తెలుగు తమిళ చిత్రాల హీరో విశాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి కార్యవర్గం పలు ఆరోపణలను ఎదుర్కోవడం, ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలి కార్యనిర్వాకాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. నటుడు విశాల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మాతల మండలికి చెందిన నిధిలో రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దానికి సరైన వివరాలను చూపడం లేదని మండలి సభ్యులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నటుడు కే.రాజన్, ఎస్‌వీ.శేఖర్, ఏఎల్‌.అళగప్పన్‌ పలువురు సభ్యులు మండలి కార్యాలయం ముందు ఆందోళన చేసి కార్యాలయానికి తాళం వేశారు. ఈ వ్యవహారం పోలీస్‌ కేసులు, అరెస్ట్‌లు, కోర్టుల వరకూ వెళ్లింది. అదే విధంగా మండలికి చెందిన ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక ఇటీవల నిర్వహించిన ఇళయరాజా 75వ అభినందన కార్యక్రమానికి సర్వసభ్య సమావేశంలో అంగీకారం పొందలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యక్రమానికి చెందిన ఆదాయ, ఖర్చుల వివరాలను వెల్లడించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలిలో జరుగుతున్న అవనీతి, అవకతవకలపై ప్రభుత్వం చర్చలు తీసుకోవాలని మండలిలోని ఒక వర్గం ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల్లో నిర్మాత మండలి నిర్వాకాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని మండలి రిజిస్టార్‌ తెలిపారు. కాగా నిర్మాతల మండలి పర్యవేక్షకుడిగా ఎన్‌.శేఖర్‌ని ప్రభుత్వం నియమించింది. ఇకపై మండలిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయన ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం నిర్మాతలమండలి కార్యవర్గానికి అవమానకరమైన అంశమే అవుతుంది. ముఖ్యంగా మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఇది ఘోర అవమానకరమైన ఘటనే.
 
ఇవే కారణాలు..

ప్రభుత్వం నిర్మాతల మండలిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి 5 కారణాలను పేర్కొంది. మండలికి చెందిన నిధిలోంచి స్వచ్ఛంద సంస్థలకు రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇది మండలి విధి విధానాలకు వ్యతిరేకం. అదే విధంగా మండలి నిధిలో కోట్లాది రూపాయల్లో అవకతవకలు జరిగాయి. ఇక మండలి ఏ విషయంలోనూ నిబంధనల ప్రకారం సరైన రికార్డులను పొందుపరచలేదు. అలాగే చిరునామాను మార్చి ఆ వివరాలను ప్రభుత్వ రిజిస్టర్‌ కార్యాలయంలో నమోదు చేసుకోలేదు. ఇది చట్ట విరుద్దమైన చర్య. మండలిలోని అవకతవకల కారణంగా మీరే సొంతంగా నిబంధనలను రూపొందించుకోవడం అపాయకరం. అలాగే నిబంధనలను మార్చినా వాటిని సర్వసభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక మండలి ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదు’అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మండలిలో వ్యతిరేక వర్గం ఇప్పటి వరకూ విశాల్‌ వర్గంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement