భివండీ బీజే కపిల్ పాటిల్పీ అభ్యర్థిగా ..?
సాక్షి, ముంబై:
భివండీ బీజేపీ అభ్యర్థిగా కపిల్ పాటిల్ దాదాపు ఖరారైంది. అయితే అధికారికంగా మాత్రం ఆ పార్టీ నుంచి ఇంకా ఏ ప్రకటనా రాలేదు. కపిల్ పాటిల్ బీజేపీలో చేరడంతోనే దాదాపు ఆయన భివండీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డే, ఏక్‌నాథ్ ఖడ్సే సమక్షంలో నారీమన్ పాయింట్‌లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఎన్సీపీ ఠాణే గ్రామీణ అధ్యక్షుడు కపిల్ పాటిల్ బీజేపీలో చేరారు.
ఆయనతో పాటు మరో 200 మంది ఎన్సీపీ కార్యకర్తలు కూడా కాషాయ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరిలో భివండీ పంచాయతీ సమితి అధ్యక్షులు మనీషా భోయిర్, మోహన్ అంధారే, శాంతారామ్ భోయిర్‌లు కూడా ఉన్నారు.
కపిల్‌తో బీజేపీకి ప్లస్సే...
గ్రామీణ ప్రాంతంలో కపిల్ పాటిల్‌కు మంచి పట్టుఉంది. ఠాణే జిల్లా పరిషత్, జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా ఆయన విధులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ ఎవరిని బరిలోకి దింపనుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఎమ్మెన్నెస్ నాయకుడైన సురేష్ అలియాస్ బాల్యామామా మాత్రే పేరు కూడా వినిపించింది. అయితే ఎమ్మెన్నెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మంగళ్‌ప్రభాత్ లోధా పేరు ముందుకు వచ్చింది. అయితే స్థానికులకే టికెట్ ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో కపిల్ పాటిల్ బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ మంగళవారం ఆయన బీజేపీ పార్టీలో తన మద్దతుదారులతోపాటు చేరారు. దీంతో దాదాపు ఆయననే భివండీ లోకసభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే టికెట్ దాదాపు ఖరారైంది. అయితే బీజేపీ నుంచి అధికార ప్రకటన రావల్సి ఉంది.
పాటిల్ పార్టీ....
బీజేపీ ఇప్పుడు ముండే, ఫడ్నవీస్‌ల పార్టీ కాదని, పాటిల్ పార్టీగా మారిందని అభివర్ణిస్తూ ఎన్సీపీ, కాంగ్రెస్‌పై తనదైన శైలిలో గోపీనాథ్ ముండే చురకలంటించారు. తమ మిత్రపక్షమైన శివసేనలోని కొందరు పార్టీ వీడిన మాటవాస్తవమే. వారు వెళ్లడంతో ఇబ్బందేమీలేదు. ఇది మహాకూటమికి మైనస్ కాదు. ఒకవేళ అలా భావిస్తే కపిల్ పాటిల్ రాకతో మేము మళ్లీ ప్లస్ అయ్యామ’ని వివరించారు.
ఎలాంటి విభేదాలు లేవు...
మహాకూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. మాలో ఎలాంటి విభేదాలులేవన్నారు. ఉద్దవ్ ఠాక్రేతో చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పారు. రాజ్‌ఠాక్రేతో నితిన్ గడ్కారీ భేటీపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే, బీజేపీలో నిర్ణయం తీసుకునేది ఎవరని ప్రశ్నించడంపై తెలివిగా సమాధానమిచ్చారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర బీజేపీకి తాను అధ్యక్షుడిగా విధులు నిర్వహించానని. తద్వారా అధ్యక్షుడికి ఎన్ని అధికారాలు ఉంటాయనేది తెలుసని చెప్పారు. తమ పార్టీ తుది నిర్ణయాలు ప్రకటించేది మాత్రం పార్టీ అధ్యక్షుడేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముండే ఆరోపించారు. ‘వడగళ్ల వర్షంతో రైతులు నష్టపోయారు. ఇళ్లు, పంట, పశువులు కోల్పోయినవారిని ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ’ని మరోమారు ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వం కొంతమేర నిద్ర నుంచి మేల్కొందన్నారు. రైతులకు పూర్తి నష్టపరిహారం అందేవరకు తాము పోరాడుతామన్నారు. మూడు రోజులలో మద్దతు ప్రకటించికపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. ఒకవైపు ఇప్పటి వరకు 37 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని, రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి...
రాష్ట్రంలో వడగళ్లు, వర్షం కారణంగా నెలకొన్న పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని గోపీనాథ్ ముండే డిమాండ్ చే శారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ అయిందని, దీంతో జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కేంద్రం మద్దతు నిధులు అందిస్తుందన్నారు. అయితే జాతీయ విపత్తు ప్రకటనతో ఎలాంటి లాభం లేదని పవార్ పేర్కొనడాన్ని తప్పుబట్టారు.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాందాస్ తడస వార్ధా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సాగర్ మేఘేపై బీజేపీ తరఫున రాందాస్ తడస్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ తండ్రి దత్తా మేఘేతో కలసి రాందాస్ తడస్ ఎన్సీపీలో పనిచేశారు. వార్ధా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దత్తా మేఘే తన కుమారుడి కోసం ఈ స్థానం నుంచి తప్పుకున్నారు. కాగా, యావత్మల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ శివసేన ఎంపీ భవన గవాళి పోటీచేస్తున్నారు.
భివండీని అభివృద్ధి చేద్దామనే..
సాక్షి, ముంబై: భివండీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే బీజేపీలో చేరానని కపిల్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన ఎన్సీపీను వీడి బీజేపీలో చేరిన అనంతరం సాక్షితో మాట్లాడుతూ తనకు ఎన్సీపీపై, ఎన్సీపీ నాయకులపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అదే విధంగా ఇప్పటికీ శరద్‌పవార్‌తోపాటు ఆ పార్టీలోని ఇతర నాయకులందరిపై గౌరవం ఉందన్నారు. భివండీలో ఇప్పటివరకు పెద్దగా అభివృద్ధి ఏమీ జరగలేదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ నేత నరేంద్ర మోడీ హవా నడుస్తోంది.
ఆయన నేతృత్వంలో బీజేపీతో భివండీలో అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నా.. అందుకే బీజేపీలో చేరా..నని పేర్కొన్నారు. బీజేపీ నుంచి భివండీ లోక్‌సభకు తనను అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదన్నారు. అవకాశం ఇస్తే భివండీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘స్థానికుడినైన నాకు భివండీలోని సమస్యలపై అవగాహన ఉంది. సమస్యల పరిష్కారంతోపాటు భివండీలో ఎటువంటి అభివృద్ధి అవసరమో తెలుసు కాబట్టి ప్రజలు నాకు పట్టం కడతారనే నమ్మకముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.