‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’
తిరుపతి: నోట్ల కష్టాలతో ప్రజల ఆక్రందనల్ని తమ గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఉక్కు పిడికిలితో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై దౌర్జన్యాలు చేయిస్తోందని మండిపడ్డారు.
సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... చేతులకు సంకెళ్లు వేయగలరేమో కానీ గళాలకు సంకెళ్లు వేయలేరని స్పష్టం చేశారు. నోట్ల కష్టాలతో ప్రజలంతా ఆక్రందనలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతా బాగున్నట్టుగా ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు.
‘నల్లధనం వెలికి తీయాలనే సంకల్పం గొప్పదే. పెద్ద నోట్ల రద్దును ఆహ్వానిస్తున్నాం. నవంబర్ 8న ప్రధాని మోదీ చేసిన ప్రకటనను మనస్పూర్తిగా స్వాగతించాం. ఆ తర్వాతే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. గగ్గోలు మొదలైంది. ఎక్కడ చూసినా తోపులాటలు, తొక్కిసలాటలు. నోట్ల కష్టాలతో దాదాపు 100 మంది మరణించారు. ముందస్తు సన్నాహాలు చేసి పెద్ద నోట్లను రద్దు చేసివుంటే ఈ దురవస్థ రాకుండా ఉండేది. ఊరంతా నిప్పు ఎందుకు పెట్టారయ్యా అంటే దోమల్ని చంపడానికి అన్న చందంగా పరిస్థితి తయారైంది. 9 నెలల వరకు నోట్ల కష్టాలుంటాయని ఆర్థిక నిపుణులు ఉటంకిస్తున్నారు. బీజేపీ అంటే భయంకరంగా జనాన్ని పీడిస్తున్న పార్టీ, టీడీపీ అంటే తెలివిగా దేశాన్ని దోచుకుంటున్న పార్టీ. ముందే లీకులు అందించడంతో లీకు వీరుడు చంద్రబాబు తన దగ్గరున్న లక్ష కోట్ల ధనాన్ని తెలివిగా తెల్లధనంగా మార్చుకున్నారు. మోదీని ఏమీ అనలేక బ్యాంకర్లపై చంద్రబాబు దాడి చేస్తున్నార’ని భూమన అన్నారు.