28న హర్తాళ్.. విజయవంతానికి పిలుపు
500, 1000 నోట్ల రద్దు ఫలితంగా సామన్యులకు కలుగుతున్న కష్టనష్టాలపై కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు ఈనెల 28న జరిగే హర్తాళ్ను విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ సీపీ పిలుపునిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
''దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రాంతీయపార్టీలు చేస్తున్న నిరసనలకు తన పూర్తి మద్దతు పలుకుతోంది. స్వచ్ఛందంగా దుకాణాలు, వాణిజ్య, విద్యాసంస్థలు, రవాణా స్తంభించేలా రెండు రాష్ట్రాల ప్రజలు ఈ హర్తాళ్లో పాల్గొని ప్రజావాణిని వినిపించాల్సిందిగా కోరుతోంది. 18 రోజులుగా ఓపిక పట్టినా ఫలితం లేదు. చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సమాధానపరిచే చర్యలు ఉంటాయని మేమంతా ఆశించాం. అలంటి చర్యలు లేకపోగా సామాన్యులను మరింత కష్టపెట్టేలా మొన్ననే మరిన్ని బిగింపులు ప్రకటించింది. పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి మారింది. ప్రజల కష్టాలను అధికారంలో ఉన్నవాళ్లకు గట్టిగా చెప్పడానికి రెండు రాష్ట్రాలలో ప్రజలంతా ఈనెల 28న నిరసనలలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది.
500, 1000 నోట్లను రద్దుచేయడం ద్వారా నల్లధనాన్ని, నకిలీధనాన్ని, ఉగ్రవాద మూలాలను తుదముట్టించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ వెనువెంటనే స్వాగతించింది, ఇప్పటికీ సమర్థిస్తూనే ఉంది. అయితే నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ ఫలితం వలన సామాన్యులకు కష్టం, నష్టం కలగకుండా ఎలాంటి చర్యలూ తీసుకోనందున గత 18 రోజులుగా యావత్ దేశం తల్లడిల్లిపోతోంది. ప్రధానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టనష్టాలు వర్ణనాతీతం
ఫలితంగా కుచేలులు బలి అవుతున్నారని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మా పార్టీ నవంబర్ 9 నుంచి స్పష్టం చేస్తోంది
ప్రజల కష్టాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో విలేకరుల సమావేశం ద్వారా, ఈనెల 23న ప్రధాని మోదీకి లేఖ రాయడం ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
తర్వాత పరిణామాలు చూస్తే ఎక్కడా కరెన్సీ లభించడంలేదు, బ్యాంకులు, ఏటీఎంలలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి, ఏటీఎంలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కష్టనష్టాలు, మనోభావాలను ఎత్తిచూపేందుకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 28వ తేదీన దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తలపెట్టిన హర్తాళ్, ఆందోళనలు, నిరసనలకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలుకుతోంది. పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ పోరాటంలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని అధికారికంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది'' అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.