సాక్షి, న్యూఢిల్లీ:రాజధానివాసులు ‘నమో’వైపే మొగ్గు చూపారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ బీజేపీకి కట్టబెట్టి ఆ పార్టీలో ఉత్సాహం నింపారు. ఢిల్లీలో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని నిజం చేశారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో మొత్తం ృడు స్థానాలను గెలిచిన బీజేపీ 2004 ఎన్నికల్లో కేవలం దక్షిణఢిల్లీలో మాత్రమే గెలుపొందింది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కాంగ్రెస్‌కు కట్టబెట్టి అధికారం ఇచ్చిన ఢిల్లీవాసులు ఈసారి కూడా ఏకపక్షంగా తీర్పు ఇచ్చి బీజేపీని అన్ని స్థానాల నుంచి గెలిపించారు.
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలవడంతో ఇక్కడ కూడా మోడీ తుఫాను ఉందని తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అధిక సీట్లు గెలిచి రాజధానిలో నరేంద్ర మోడీ ప్రభంజనానికి చెక్ పెడుతుందని అనుకున్న ఆప్ ఈసారి ఏడు సీట్లలోనూ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోయింది. యూపీయే సర్కారులో కీలక మంత్రిత్వశాఖ నిర్వహించిన మంత్రులు, కాంగ్రెస్‌లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన నేతలు సైతం మూడోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాందినీచౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ ఆప్ అభ్యర్థి ఆశుతోష్‌పై 1.5 లక్షలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కేంద్రమంత్రి కపిల్ సిబాల్ మూడోస్థానంలో నిలిచారు. హర్షవర్ధన్‌కు 4.36 లక్షల ఓట్లు, ఆశుతోష్‌కు 2.38 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబాల్‌కు 1.75 లక్షల ఓట్లు వచ్చాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి, ఆప్ అభ్యర్థి ఆశిష్ ఖేతాన్‌ను 1.63 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ దిగ్గజం, మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ ఇక్కడ మూడోస్థానంలో నిలిచారు. మీనాక్షీ లేఖికి 4.53 లక్షల ఓట్లు, ఆశిశ్ కు 2.90 లక్షల ఓట్లు, మాకెన్‌కు 1.82 లక్షల ఓట్లు పోలయ్యాయి.
ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మహేష్ గిరి విజయం నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని చాటి చెప్పింది. ఆయన మహాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీని, షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను ఓడించారు. మహేష్ గిరికి 5.72 లక్షల ఓట్లు, రాజ్‌మోహన్‌గాంధీకి 3.81 లక్షల ఓట్లు, సందీప్ దీక్షిత్ 2.03 లక్షల ఓట్లు వచ్చాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో భోజ్‌పురి గాయకుడు, బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ 1.44 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ఆప్ అభ్యర్థి ఆనంద్‌కుమార్, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌ను ఓడించారు.
మనోజ్ తివారీకి 5.96 లక్షల ఓట్లు. ఆనంద్‌కుమార్‌కు 4.52 లక్షల ఓట్లు, అగర్వాల్‌కు 2.14 లక్షల ఓట్లు వచ్చా యి. సౌత్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి తుగ్లకాబాద్ ఎమ్మె ల్యే రమేష్ బిధూడీ, ఆప్ అభ్యర్థి కల్నల్ దేవేంద్ర సెహ్రావత్‌ను 1.07 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయనకు 4.97 లక్షల ఓట్లు, సెహ్రావత్‌కు 3.90 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ 1.25 లక్షల ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. వెస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి మెహ్రోలీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్‌పై 2.69 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రవేశ్ వర్మకు 6.51 లక్షల ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్‌కు 3.82 లక్షల ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రాకు 1.93 లక్షల ఓట్లు పడ్డాయి. రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన నార్త్ వెస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి ఉదిత్ రాజ్ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లాను లక్షా ఆరు వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి, యూపీయే సర్కారులో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న కృష్ణా తీరథ్ మూడోస్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉదిత్ రాజ్‌కు 6.29 లక్షల ఓట్లు, రాఖీ బిర్లాకు 5.23 లక్షల ఓట్లు, కృష్ణాతీరథ్‌కు 1.57 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో నోటా కింద 8,826 ఓట్లు పోలయ్యాయి. ఆప్ ఈ నియోజకవర్గం నుంచి మొదట మహేంద్ర సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించి టికెట్‌ను ఉపసంహరించుకుని రాఖీ బిర్లాకు అవకాశం ఇచ్చింది.
పార్టీ ఓట్ల శాతం పోలయిన ఓట్లు బీజేపీ 46.4 38,37,380 ఆప్ 32.9 27,21,784 కాంగ్రెస్ 12.1 12,54,491 నోటా 0.5 39,368
మోడీ హవా!
Published Fri, May 16 2014 10:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement