సాక్షి, ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై బీజేపీ దృష్టి పెట్టింది. 2016లో జరగనున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఎలాగైన మేయర్ పదవి దక్కించుకోవాలని ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. అందుకు వచ్చే బీఎంసీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వివిధ పార్టీలకు చెందిన మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్ల జాబితా రూపొందించడంలో బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు. వారందరిని బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
దీంతో మేయర్ పీఠం సునాయాసనంగా చేజిక్కుంచుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ముంబైలో అత్యధికంగా బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని కార్పొరేటర్ల సీట్లు గెలుచుకుని మేయర్ పదవి దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల గెలిచే సత్తా ఉన్న వివిధ పార్టీలకు చెందిన వంద మంది మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్ల జాబితాను రూపొందించి సిద్ధంగా ఉంచారు. ఇందులో స్థానికుల (మరాఠీ)తోపాటు గుజరాత్, ముస్లిం, ఇతర భాషలకు చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్‌వాది పార్టీ, ఎమ్మెన్నెస్‌తోపాటు శివసేనకు చెందిన మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని ఓ మహిళ కార్పొరేటర్ తెలిపారు.
మేయర్ పదవిపై బీజేపీ కన్ను..
Published Sat, Dec 6 2014 10:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement