సమరానికి సై...
గ్రేటర్ ఎన్నికలకు శంఖారావం పూరించిన టీడీపీ-బీజేపీ
కార్యకర్తలు, అభిమానులతో నిండిన నిజాం కాలేజీ గ్రౌండ్
సిటీబ్యూరో : గ్రేటర్ హైదారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా టీడీపీ- బీజేపీ మిత్రపక్షాలు సంయుక్తంగా పూర్తించిన ‘ ఎన్నికల శంఖారావం’ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. బల్దియా ఎన్నికల సమరానికి సై అంటూ అగ్రనేతలు చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణులను ఆకట్టుకొన్నాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ టీడీపీ-బీజేపీ మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం సభ’ విజయవంతమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు జగత్ ప్రకాశ్‌నడ్డా, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి హాజరయ్యారు. సభకు ప్రత్యేకించి మహిళలను రప్పించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. నగరంలో 2002నాటి పరిస్థితులను పునరావృతం చేయాలని అగ్రనాయకులు పేర్కొన్నారు. అయితే... వారి ప్రసంగాలకు తగ్గట్టు సభికుల నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు వంటివారు సభికుల పైనే చలోక్తులు విసిరి... జోష్‌ను తెచ్చేందుకు ప్రయత్నించారు. ‘మీరు ఇలా మౌనంగా ఉండటం వల్లే... కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు’ అని సభికుల్లో వేడి రగిలించేందుకు ప్రయత్నించారు.
టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తున్నంత సేపు కాస్త హడావుడి కన్పించింది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తింటడు... ఫాం హౌస్‌లో పంటడు’ ముఖ్యమంత్రి చేయాల్సింది ఇదేనా... మీరే చెప్పండి అంటూ సభికులను ప్రశ్నించారు. ‘షహర్ హమారా... మేయర్ హమారా’ అంటూ పలువురు నాయకులు తమ ్రపసంగాల్లో పదేపదే వల్లెవే శారు. టిఆర్‌ఎస్- మజ్లిస్ పార్టీ నేతల తీరును ఎద్దేవా చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మన్, నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి, మీసాల చంద్రయ్య, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌లు చేసిన ప్రసంగాలు ఆకట్టుకొన్నాయి. ఎన్టీఆర్ వేషధారణలో ఉప్పల్‌కు చెందిన వి.రాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉర్రూతలూగించిన పాటలు : కేసీఆర్ పాలనను తూర్పారబడుతూ కళాకారుల పాటలు ఉర్రూత లూగించాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు 18 నెలలైనా నెరవేర్చలేని తీరును ఎద్దేవా చేస్తూ పాడిన పాటలు సభికులను ఆలోచింపజేశాయి. ‘అయ్యా ఓ కేసీఆరూ... నీకెట్ట వాస్తుబాగాలేదు సారూ...’ అంటూ ముఖ్యమంత్రి వాస్తునమ్మకాన్ని ఎద్దేవా చేశారు. ‘దళితుడూ ముఖ్యమంత్రని దండోరా వేశావు... ఊరూరా తిరిగినప్పుడు ఓట్లల్లో జెప్పావు ’ అంటూ దళితుడిని ముఖ్యమంత్రి చేయని తీరును విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వని తీరు, ఇంటికో ఉద్యోగం అన్న హామీ తుంగలో తొక్కిన వైనం, బీసీ కులాల జాబితాలో 26కులాలను తొలగించన వైనం, సీమాంధ్ర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వని వైఖరిని ఎండగడుతూ కళాకారులు తమ పాటల ద్వారా సభికులకు వివరించారు.