35 లక్షలకు ‘కమలం’
సభ్యత్వ సంబరంలో నేతలు
ఎన్నికలకు సిద్ధం : తమిళి సై
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వం 35 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు రికార్డులో భాగంగా రాష్ట్రంలోనూ కమలనాథులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. ఇక, తమకు ప్రజాదరణ పెరగడంతో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్టంలో లోక్ సభ ఎన్నికల ముందు వరకు బీజేపీ చతికిల బడి ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీని అక్కున చేర్చుకునే వాళ్లే లేరు. ఎట్టకేలకు 2014 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార పగ్గాలు కమలం చేతికి చిక్కడంతో రాష్ట్రంలోని కమలనాథుల దూకుడుకు హద్దే లేద
ు. పార్టీ బలోపేతం లక్ష్యంగా, 2016లో తమిళనాడులో అధికారం తమదేనన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ప్రజా మద్దతును కూడ గట్టుకునే విధంగా సభ్యత్వ పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో నామ మాత్రంగానే ఉన్న కమలం సభ్యత్వం ఇప్పుడు లక్షల్లో సాగుతున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు నెలల నెలల క్రితం మిస్డ్ కాల్ కొట్టు..సభ్యత్వం పట్టు నినాదంతో చేపట్టిన ప్రక్రియకు స్పందన బాగానే వచ్చి ఉన్నది. రాష్ట్రంలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 35 లక్షలకు చేరింది. ఈ ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లోపు సభ్యత్వంలో అర కోటి చేరుకోవడం లక్ష్యంగా కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తుండటం విశేషం.
రూ. 35 లక్షలు : దేశ వ్యాప్తంగా బిజేపి సభ్యత్వం పది కోట్లకు చేరి ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రంలో ఇప్పటి వరకు తమ పార్టీ సభ్యత్వ నమోదు సాగిన తీరును రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మీడియాకు వివరించారు. తమ పార్టీకి విశేష స్పందన వస్తున్నదని, తాము గడువుగా నిర్ణయించిన సమయంలోపు మరికొన్ని లక్షల మంది సభ్యులుగా చేరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తమకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పది కోట్ల సభ్యత్వ సంబరాల్లో భాగంగా పార్టీ వర్గాలకు ఆమె స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు.