ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ వెనకడుగు మచ్చపడకూడదనే
సాక్షి, న్యూఢిల్లీ: సంఖ్యాబలం లేకపోవడం, ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కంటే ఎన్నికలకు వెళ్లడమే శ్రేయస్కరమని బీజేపీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతోందని తెలిసింది. ఎన్నికలకు వెళ్లడం ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యంగా కనిపిస్తున్నందువల్ల ఆ దిశగా ప్రయత్నం చేయకూడదని అధిష్టానం భావిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేశారనే అపఖ్యాతి మోయడానికి నరేంద్ర మోడీ సుముఖంగా లేరని, అయితే ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించాలనే యోచన కూడా పార్టీకి లేదని అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇప్పుడు కొంత మార్పు వచ్చిందని, ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు జరిపినా సంపూర్ణ మెజారిటీ రానట్లయితే దాని ప్రభావం నరేంద్రమోడీపై పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల ఢిల్లీలో రాష్ట్రపతిపాలనను మరికొంతకాలం పొడిగించి డిసెంబర్‌లో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఎన్నికలు జరిపించడం మేలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించి వచ్చే నెల 16వ తేదీనాటికి ఆరు నెలలు పూర్తవుతాయి.
అగ్రనేతలతో మోడీ భేటీ
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సీనియర్ నేతలు నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితర నేతలతో మోడీ ఈ అంశంపై చర్చించారని తెలిసింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనేతలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని అంటున్నారు. నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటును సమర్థించారని, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించారని అంటున్నారు. దీనితో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునేముందు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనున్నారని అంటున్నారు.
కాంగ్రెస్‌లోకి శర్మిష్ట
కాంగ్రెస్ పార్టీకి కొత్త కళ వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించిన ఆమె పార్టీ ఆదేశిస్తే... శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఆమె గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రె స్ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరుగుతుందని, దానిలో శర్మిష్టకు కూడా ఏదైనా బాధ్యత అప్పగించవచ్చని అంటున్నారు. శర్మిష్ట కొంతకాలంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా జరిపిన మైనపుఒత్తుల ప్రదర్శనలోనూ, ఢిల్లీ కాంగ్రెస్ నిర్వహించిన పార్లమెంట్ ఘెరావ్ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్న సంగతి విదితమే. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో చదివిన శర్మిష్ట కథక్ నాట్యకారిణి. ఆమె దేశ విదేశాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. షర్మిష్ట సోదరుడు అభిజీత్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.