- తడిసిముద్దైన ఉత్తర కర్ణాటక
- ఎడతెరిపి లేని వర్షాలకు ముగ్గురు బలి
- దెబ్బతిన్న రహదారులు, పంటలు
- విద్యాలయాలకు సెలవులు
సాక్షి, బెంగళూరు : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర కర్ణాటక ప్రాంతం తడిసిముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర కర్ణాటకలోని బీదర్, రాయచూరు, యాదగిరి, గుల్బర్గా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల కారణంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.
యాదగిరి జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో నరసమ్మ(38), రాయచూరు నగరంలో ఇంటి గోడకూలి సాగర్(12), గుల్బర్గ జిల్లా కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన గూగల్ గ్రామవాసి శరణబసప్ప(38) నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయి మరణించారు. ఇక గుల్బర్గా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అనే గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ఆయా గ్రామాల వాసులు ఎప్పుడు నీరు ముంచేస్తుందో అన్న భయంతో మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ఇళ్లల్లోకి చేరిన నీటిని బయటికి పంపే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక బెణ్ణెతూరె నదిలో ప్రవాహ ఉధృతి పెరగడంతో వేల ఎకరాల పంట నీటమునిగింది. ఇక ఆయా ప్రాంతాల్లో వర్ష ఉధృతికి రహదారులు కొట్టుకొనిపోయాయి. దీంతో బీదర్, రాయచూరు, యాదగిరి, గుల్బర్గా జిల్లాలకు బయటి ప్రాంతాల నుంచి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి.
ఇక ఈ జిల్లాల్లో నెలకొన్న అతివృష్టి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు గాను ఆయా జిల్లాల అధికారులు ఉచిత ఆహార వితరణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.