లీకేజీలపై బీఎంసీ దృష్టి | BMC focus on underground water pipes leakage | Sakshi
Sakshi News home page

లీకేజీలపై బీఎంసీ దృష్టి

Published Thu, Apr 24 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

BMC focus on underground water pipes leakage

సాక్షి, ముంబై: భూగర్భంలో నీటిపైపుల లీకేజీని గుర్తించే అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) యోచిస్తోంది. ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే భూమిలో కలసిపోతున్న లక్షల లీటర్ల తాగు నీరు ఆదా కానుంది. నగర రహదారుల కింద ఏర్పాటుచేసిన నీటి పైపులు బ్రిటిష్ కాలంలో వేసినవే. తరచూ మరమ్మతులు చేపడుతున్నా రోజూ ఎక్కడో ఒకచోట లీకేజీ అవుతూనే ఉంది. దీంతో లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది.

 ఇలా లీకైన నీరు భూమిలో ఇంకిపోవడంవల్ల తరచూ భూమి కుంగిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భూగర్భంలో అవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి..? వాటి వాల్వులు ఎక్కడెక్కడున్నాయో ఇప్పటి ఇంజనీర్లకు స్పష్టంగా తెలియదు. లీకేజీ గుర్తించడానికి బీఎంసీ పరిపాల నా విభాగం వద్ద ఆధునిక యంత్ర పరికరాలు లేవు. భూమిని తవ్వితే తప్ప లీకేజీలు బయటపడటంలేదు. భూమిని తవ్వడమంటే అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం..దాంతోపాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.

 దీంతో లీకేజీని గుర్తించడమంటే బీఎంసీ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. నీటి లీకేజీని గుర్తించేందుకు లీక్ డిటెక్షన్ మెషిన్, పైప్‌లైన్ లొకేటర్, వాల్వ్ లొకేటర్, డిజిటల్ సౌండ్ స్టిక్ యంత్రాలున్నాయని అధికారులు తెలిపారు.
 వీటిని కొనుగోలు చేయడానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చవుతాయని నీటి సరఫరా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వీటి సాయంతో భూగర్భంలో జరుగుతున్న లీకేజీని వెంటనే అరికట్టవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement