నిశ్చితార్థం పెట్టుకొని ఏం పని చేశారంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక):
ఓ వైపు నిశ్చితార్థం పెట్టుకొని మరో వైపు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ యువ జంట. వివరాలు..బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది. వెంటనే అధికారులు విమానాన్ని ఆపేసి హుటాహుటిన అణువణువూ తనిఖీ చేశారు, చివరకు ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.45గంటలకు బెంగళూరు నుంచి కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాల్సిన విమానంలో బాంబు ఉందని ఎయిర్‌పోర్టుకు కాల్ వచ్చింది.
దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు ప్రయాణికులను దించివేసి బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్నంగా తనిఖీ చేయించారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. 160 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఏషియా విమానం చివరకు గురువారం తెల్లవారుజామున 3.10గంటలకు టేకాఫ్ అయ్యింది.
బెదిరింపు కాల్‌కు సంబంధించి కేరళలోని అలెప్పీ పట్టణానికి చెందిన అర్జున్, నేహా గోపీనాథ్ అనే యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలెప్పీలో ఒక పబ్లిక్ బూత్ నుంచి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ జంటకు గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఎందుకు ఫోన్ కాల్ చేశారనేది దర్యాప్తు చేస్తున్నారు.