దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.
కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment