ముంబై: పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీకి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. మాజీ భార్య సబాహ గలదారీ దాఖలు చేసిన కేసులో అద్నాన్ సమీ తన పాస్‌పోర్టును దర్యాప్తు అధికారులకు అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సబాహ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఆర్‌పీ సొందుర్‌బాల్ బుధవారంనాడు పాస్ పోర్ట్ అప్పగించాలని ఆదేశించారు. తనను హింసించిన కేసులో ముందస్తు బెయిల్ పొందిన అద్నాన్, హైకోర్టు మే 2009న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలేదని కోర్టుకు నివేదించింది. ఇద్దరి పూచీకత్తుపై హైకోర్టు అద్నాన్‌క ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే జామీను ఇచ్చిన వ్యక్తులు జూలైలో తాము అద్నాన్ జామీను నుంచి వైదొలుగుతున్నట్లు తెలపారు. ఈ మేరకు కోర్టు అనుమతినిచ్చింది.
అప్పటి నుంచి అద్నాన్‌కు జామీను ఇవ్వడానికి మరెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో సబాహ న్యాయవాదులు మహేశ్ జత్మలానీ, ఎడిత్ డేలు కోర్టు ఆదేశాల ప్రకారం జామీన్‌దారులను ఏర్పాటు చేయడంలో అద్నాన్ విఫలమయ్యాడని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనని న్యాయస్థానానికి నివేదించారు. కాగా అద్నాన్ అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నాడని అతని న్యాయవాది కోర్టుకు తెలిపాడు.
ఇదిలా ఉండగా, అద్నాన్ నివాసముంటున్న లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఫైవ్ ఇన్ వన్ ఓబబెరాయ్ స్కైగార్డెన్ ఫ్లాట్లను ఖాళీ చేసి సబాహకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఫ్లాట్లలో అద్నాన్ తన మూడవ భార్య రోయా ఫరీబితో కలిసి నివసిస్తున్నాడు. ఈ ఫ్లాట్లు తన తల్లిగారి ఆస్తి అని సబాహ కోర్టుకు తెలిపింది.