తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం
చెన్నై: ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటా పోటీగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌తో గురువారం భేటీ అయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం,అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బయటికి వస్తున్నప్పుడు మాత్రం నవ్వుతూ కనిపించారు. అధికారం తమదే అన్న రీతిలో ఇద్దరు నేతలు ధీమాగా కనిపించారు. అయితే వీరిద్దరి హావాభావాల వెనుక మరో కోణం కూడా ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
గవర్నర్‌తో భేటీ అనంతరం నవ్వుతూ కనిపించిన పన్నీర్ సెల్వం ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు. మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
మరో వైపు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ కూడా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంతకాలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే భేటీ అనంతరం శశికళ కూడా నవ్వుతూ కనిపించారు. మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఆమె వాహనంలో పోయేస్ గార్డెన్‌కు వెళ్లిపోయారు.
అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి ఇద్దరికిద్దరూ సిధ్దం అంటూ ప్రకటనలు చేశారు. అయితే ఈ నవ్వు వెనుక మరో కోణం దాగి ఉందని అంటున్నారు విశ్లేషకులు. మోహంలో కొద్దిగా టెన్షన్ కనిపించినా తమకు అండగా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేయిజారిపోతారో అనే భావన ఇద్దరిలో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరితో భేటీ అనంతరం గవర్నర్ తీసుకునే నిర్ణయం పై తమిళ ప్రజలే కాకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.